మాదాపూర్, జూలై 8: మాదాపూర్‌లోని చందానాయక్ తండాలోని రెసోనెన్స్ హాస్టల్ (శాతవాహన క్యాంపస్ 3)లో కలుషితాహారంపై విద్యార్థులు నిలదీయడం.. నిర్వాహకులు బాధ్యతారహిత్యంగా సమాధానం ఇవ్వడం.. మాటమాట పెరిగి.. పరస్పరం దాడులకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. అన్నంలో పురుగులు, సాంబారులో బొద్దింకలు ఉండటం చూసి తీవ్ర ఆగ్రహనికి గురైన విద్యార్థులు..
హాస్టల్ నిర్వాహకులను ప్రశ్నించగా, నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కళాశాల సిబ్బంది, విద్యార్థుల మధ్య మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగారు. ఈ క్రమంలో విద్యార్థులు కళాశాల కార్యాలయంలోని కిటికీల అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో క్యాంపస్ అంతా గందరగోళంగా మారింది. మాదాపూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.