గుర్రంగూడ ఆదిత్యనగర్ కాలనీలోని ఫేజ్1లో కరెంట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ హెచ్చుతగ్గులతో ఇబ్బంది పడుతున్నామని వినియోగదారులు టీజీఎస్పీడీసీఎల్కు ఫిర్యాదు చేశారు. అయినా స్పందనే లేదు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ద్వారకామయికాలనీలో కరెంట్ పోయి తిరిగి వచ్చిన తర్వాత లో ఓల్టేజి సమస్య తలెత్తుతున్నదని స్థానికులు దక్షిణ డిస్కంకు ఫిర్యాదు చేశారు. భోలక్‌పూర్ ప్రాంతంలో కరెంట్ సైప్లె లేకపోవడం, ఒకవేళ వచ్చినా లోఓల్టేజితో విద్యుత్ హెచ్చుతగ్గులతోఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు వీడియోలతో సహా స్థానిక సిబ్బందికి ఫిర్యాదు చేస్తే వారు ట్రాన్స్ఫార్మర్ మార్చాలంటూ చెప్పి చేతులు దులిపేసుకున్నారు.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ)
దక్షిణ డిస్కంకు కేవలం ఈ రెండు మూడు రోజుల్లోనే పదుల సంఖ్యలో లోఓల్టేజి ఫిర్యాదులు వచ్చాయి. ఇలా వచ్చిన ఫిర్యాదులపై ఎలా స్పందించాలో వినియోగదారులకు ఏం చెప్పాలో తెలియక విద్యుత్ సిబ్బంది సతమతమవుతున్నారు. లోఓల్టేజికి కారణాలేంటనే దిశగా వినియోగదారులు అడిగినప్పటికీ చెప్పలేని స్థితిలో సిబ్బంది ఉన్నారు.ఫోన్లకు స్పందించడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. మూడుజోన్ల పరిధిలో పది డివిజన్లలో ఉన్న సబ్స్టేషన్లలో సగానికి పైగా ఈ సమస్యలు ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు. కార్పొరేట్ ఆఫీసులో ఉన్న మెటీరియల్ కొరత , అధికారుల మధ్య సమన్వయ లోపం వంటి పరిస్థితుల కారణంగా లోఓల్టేజి సమస్యను పరిష్కరించలేకపోతున్నామని, దీంతో స్థానికంగా క్షేత్రస్థాయిలో వినియోగదారులకు తాము సర్దిచెప్పలేకపోతున్నామని ఆ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.
కరెంట్ సరఫరాలో హెచ్చుతగ్గులకు వేసవి వేడి తీవ్రత కూడా ఒక కారణమని చెబుతున్నారు. కరెంట్ వినియోగం పెరగడం వల్ల ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయని, లేక ఏబీ స్విచ్‌లు, ఇన్సులేటర్లు కాలిపోతున్నాయని చెడిపోతున్నాయన్నారు. ఇదిలా ఉంటే ట్రాన్స్ఫార్మర్లపై కూడా లోడ్ పెరుగుతున్నదని, లోడ్ భరించలేక సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నట్లుగా వినియోగదారులకు సర్ది చెప్పుకుంటున్నారు. స్విచ్‌లు, ఇన్సులేటర్లు మార్చడం ఒక ఎత్తైతే ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు, కేబుల్స్ మార్చడంలోనే అసలు సమస్య వస్తుందని తెలుపుతున్నారు. ఎండతీవ్రత, విద్యుత్ వినియోగం కారణంగా ట్రాన్స్ఫార్మర్లు వేడెక్కుతున్నాయి. ఇన్సులేషన్ బ్రేక్‌డౌన్, ఓవర్ ఓల్టేజితో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడే ప్రమాదముంది. గత ప్రభుత్వ హయాంలో ఇంతగా ఓల్టేజి సమస్య రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సరఫరా చేస్తున్న కరెంట్ నాణ్యతలో అనుమానమున్నదంటూ నిపుణులు అనుమానపడుతున్నారు.
నాణ్యత లేని తీగలు ..
విద్యుత్ వినియోగం పెరగడం, ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్‌లోడ్, నాణ్యతలేని విద్యుత్ తీగల కారణంగా లోఓల్టేజ్ సమస్య వస్తుందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. పరికరాలు పాడవడానికి, లైట్లు,ఫ్యాన్లు దెబ్బతినడం, మసకబారడానికి కారణమవుతుందంటున్నారు. వేసవిలో ఏసీలు, ఫ్రిజ్‌లు, మోటార్ల వాడకం వల్ల డీటీఆర్లు హీటెక్కుతాయి. ఇళ్లలో లేదా వీధుల్లో పాత వైరింగ్ వల్ల ఓల్టేజి పడిపోతుంది. ఇళ్లల్లో గృహోపకరణాలు కాలిపోతున్నాయని, షార్ట్‌సర్క్యూట్ కావడం వల్ల ఎప్పుడేం జరుగుతుందోనన్న భయంలో బతుకుతున్నామని పలువురు వినియోగదారులు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అయితే విద్యుత్ సమస్యలపై తాము ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా సిబ్బంది స్పందించడం లేదని మండిపడుతున్నారు.