హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 మొట్టికాయలు
సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): వినియోగదారులను ఇబ్బందులు పెట్టొద్దని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు గురువారం హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 మొట్టికాయలు వేసింది. వివరాల్లోకి వెళితే.. కూకట్‌పల్లికి చెందిన జీసీ బాబు అలియస్ గొర్ల చంటిబాబు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి రూ.10,65,643 లోన్ తీసుకొని హోండాసిటీ వీఎక్స్ కారును కొనుగోలు చేశాడు. కొనుగోలుదారుడు 38 వాయిదాలు చెల్లించి.. మిగతావి చెల్లించనందున బ్యాంకు ఎలాంటి నోటీసులు లేకుండా కారును సీజ్‌చేసి ఇతరులకు విక్రయించింది.
తనకు ఎలాంటి నోటీసులు అందలేదని ఫిర్యాదు దారుడు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1ను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నాడు. కేసు వివరాలను హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు రామ్మోహన్, సి.లక్ష్మీప్రసన్నతో కూడిన బెంచ్ విచారించింది. అతడికి నోటీసులు అందినట్లు రుజువుకాకపోవడంతో బాధితుడికి నష్టపరిహారం కింద రూ.50వేలు, ఖర్చుల కింద మరో రూ.5వేలు చెల్లించాలని బెంచ్ ఆదేశించింది.