సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): వినియోగదారుల విజ్ఞప్తిని పట్టించుకోరా అంటూ హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 ప్రశ్నించింది. రూ.8వేలు రీఫండ్ చేయాలని కార్ఖానాలోని కలర్స్ హెల్త్ క్లినిక్‌ను ఆదేశించింది. బోయిన్‌పల్లికి చెందిన ఇచ్చాపురం విజయశ్రీ (వెయిట్ లాస్) బరువు తగ్గేందుకు కార్ఖానాలోని కలర్స్ హెల్త్ క్లినిక్‌ను సంప్రదించింది. వారు 30 సిట్టింగుల్లో10 నుంచి 15 కిలోల బరువు తగ్గిస్తామని, ఇందుకు రూ.25 వేలు ఖర్చు అవుతుందని చెప్పగా విజయశ్రీ రూ.25వేలు చెల్లించి 15 సార్లు చికిత్స కోసం వెళ్లింది.
మొత్తం ఒక కిలో మాత్రమే తగ్గగా.. చికిత్స సమయంలో అసౌకర్యానికి గురి చేసిన నిర్వాహకులను నిలదీసింది. తన డబ్బులు తనకు ఇవ్వాలని అడిగినా వారు పట్టించుకోక పోగా.. లీగల్ నోటీసులు ఇచ్చి మిగిలిన సెషన్లకు రావాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆమె వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. కేసును పరిశీలించిన హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్న, శాసనకోట మాధవిలతో కూడిన బెంచ్ ఫిర్యాదుదారుకు రూ.8వేలు రీఫండ్ చేయాలని కలర్స్ హెల్త్ క్లినిక్‌ను ఆదేశించింది. మానసికంగా ఇబ్బందులకు గురిచేసినందుకు రూ.1000, కోర్టు ఖర్చుల కింద మరో రూ.1000 చెల్లించాలని సూచించింది.