సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఎర్రగడ్డకు చెందిన డేగల రామమూర్తి ఖైరతాబాద్‌లోని కెనరా బ్యాంక్ నుంచి హౌసింగ్ లోన్ పొందారు. అనంతరం వన్‌టైం సెటిల్మెంట్లో భాగంగా రూ.5.95 లక్షలు (25శాతం వడ్డీతో కలిపి) 2018లో డిపాజిట్ చేశారు. అయితే, ఎన్వోసీ ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో ఆలస్యమైంది. దీంతో, ఇతర బ్యాంకులు ఇచ్చే హౌసింగ్ లోన్ ప్రతిపాదనలు విఫలమయ్యాయి. దీంతో ఫిర్యాదుదారుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం కోరారు.
హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్న, శాసనకోట మాధవిలతో కూడిన బెంచ్ కేసుకు సంబంధించిన పూర్తి పత్రాలను పరిశీలించారు. నిబంధనల ప్రకారం వినియోగదారుడికి రూ.5.95 లక్షలు రీఫండ్ చేయాలని, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసినందుకు బ్యాంకు రూ.15వేల నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఖర్చుల కింద రూ.10వేలు అందజేయాలని సూచించింది. 45 రోజుల్లో తమ ఆదేశాలను అమలు చేయాలని కోరింది.