సిటీబ్యూరో/మణికొండ, మే 28 (నమస్తే తెలంగాణ) : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మాణ రంగ అనుమతులకు గ్రహణం పట్టింది. ఆర్థిక వ్యవస్థకు వెన్నులముకగా నిలిచే నిర్మాణ రంగం ఇప్పటికే పలు కారణాలతో తీవ్ర చతికిలపడగా.. ప్రభుత్వ అధికారుల అలసత్వం, ఉదాసీనత ఆ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా సీఎంసీలో ఇండ్లు, వ్యాపార సముదాయాలు నిర్మించుకోవాలనుకునే సామాన్యుల నుంచి, భారీ ప్రాజెక్టులు చేపట్టే బిల్డర్ల వరకు అందరికీ ఇప్పుడు ‘అనుమతుల’ గండం వెంటాడుతున్నది.
వాస్తవంగా మున్సిపల్ చట్టం ప్రకారం బిల్డ్ నౌ ఆన్ లైన్లో భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు వచ్చిన 21 రోజుల్లోపే వాటిని మంజూరు చేయడం లేదా తిరసరించడం వంటి ప్రక్రియలను సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తి చేయాల్సి ఉంటుంది. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లో మాత్రం ఈ నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కడమే కాకుండా, ప్రభుత్వం నిర్దేశించిన స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ అగ్రిమెంట్ (ఎస్ఎల్ఏ) కాలపరిమితిని కూడా అధికారులు పూర్తిగా పకన పెట్టేసి బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. భవన అనుమతులు దాదాపు 350కి పైగా దరఖాస్తులు వివిధ దశల్లో నిలిచిపోగా, నిర్మాణం పూర్తయిన తర్వాత ఇచ్చే ఓసీల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. దాదాపు 500కు పైగా ఓసీ ఫైళ్లు క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విభాగంలో కీలక బాధ్యతల్లో ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులు, జోనల్ కమిషనర్ల పనితీరుపై భవన యజమానులు, క్రెడాయ్ వంటి బిల్డర్ల సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. వారానికొకసారి జరగాల్సిన బిల్డింగ్ కమిటీ సమావేశాలు సక్రమంగా జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఫైళ్లను త్వరగా క్లియర్ చేయాల్సింది పోయి, కొందరు అధికారులు సాగదీత ధోరణిని అవలంబిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనల్లో లేని విచిత్రమైన కారణాలను వెతుకుతూ, చిన్న, చిన్న సాంకేతిక అంశాలను సాకుగా చూపి ఫైళ్లకు కొర్రీలు పెడుతున్నారని కూకట్పల్లి టౌన్‌ప్లానింగ్ అధికారులపై మండిపడుతున్నారు.ఒకసారి అడిగిన అభ్యంతరాలన్నింటినీ ఒకేసారి చెప్పకుండా, ప్రతిసారీ కొత్త కొర్రీలు పెడుతూ కాలయాపన చేస్తున్నారన్న అని ఒక కేబీహెచ్‌బీ కాలనీకి చెందిన ప్రముఖ బిల్డర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెరవెనుక ‘మామూళ్ల’ వ్యవహారం నడిపితే తప్ప..ఫైళ్లు ముందుకు కదలడం లేదనే బహిరంగ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
సుమారు 40 రోజుల కిందట బాధ్యతలు స్వీకరించిన కొత్త జోనల్ కమిషనర్‌కు సమయం లేకపోవడమే కారణంగా దాదాపు వందల సంఖ్యలో ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. శేరిలింగంపల్లి జోనల్ పరిధిలోని నార్సింగి, అమీన్పూర్, పటాన్చెరు, మియాపూర్ తదితర సర్కిళ్లలో కొనసాగుతున్న భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు, పూర్తయిన భవనాలకు ఓసీల జారీ, ఇతర పౌర సేవలు పూర్తిగా నిలిచిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్క జోన్ పరిధిలోనే 350కు పైగా పైళ్లు పెండింగ్‌లో ఉండటం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపుతున్నదని ప్రజలు అంటున్నారు. ఒక్కో ఫైల్ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.10 లక్షల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉండగా, దాదాపు మూడున్నర కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ ఆదాయం నెల రోజులుగా నిలిచిపోయిందని తెలుస్తున్నది. దీనికి ప్రధాన కారణం జోనల్ కమిషనర్ సహా సంబంధిత అధికారుల నిర్లక్ష్యమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని చెప్పుకొనే పాలకులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ అంశంపై స్పందించకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.