బాలానగర్, ఆగస్టు 30: నేటి బాలలు ఎంత చక్కగా చదువుకుంటే రేపటి సమాజం అంత పటిష్టంగా, నిర్మాణాత్మకంగా ఉంటుంది. అనుకున్నదే తడువుగా ఈ ఆలోచనలను ఆచరణలో పెట్టారు ఎమ్మెల్సీ నవీన్‌కుమార్. తన తాత మాధవరం రాంచందర్‌రావు జ్ఞాపకార్థం రూ.90 లక్షల సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాలకు నూతన భవనం నిర్మించి ఇచ్చారు.
రేకుల షెడ్ నుంచి.. సొంత భవనానికి
బాలానగర్ డివిజన్ రాజీవ్ గాంధీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాల భవనం రేకుల షెడ్లో ఉండేది. వర్షాకాలం వచ్చిందంటే మోకాళ్లలోతు నీరు తరగతి గదులలో నిల్వ ఉండేది. ఇలాంటి దుర్భర పరిస్థితులలో కూడా పాఠశాల కొనసాగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించేందుకు కంకణం కట్టుకున్నారు. 2020 మార్చి 15న శంకుస్థాపన చేసి భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే, కొద్ది రోజుల్లోనే కొవిడ్ కారణంగా లాక్డౌన్ రావడంతో పనుల్లో జాప్యం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు తర్వాత భవన నిర్మాణ పనులను చేపట్టి సత్వరమే పూర్తి చేయడానికి తీవ్రంగా కృషి చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి తరచూ నిర్మాణ పనులను పరిశీలించి పూర్తి చేయించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 210 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
ప్రభుత్వ సంకల్పానికి, నా వంతు సేవ..
టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని ఎంతగానో అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నది. సీఎం కేసీఆర్ హయాంలో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ విద్యను అందిస్తున్నారు. ప్రభుత్వ సంకల్పానికి నా వంతు సేవగా మా తాత, మాజీ మంత్రి మాధవరం రాంచందర్ రావు జ్ఞాపకార్థం ఈ పాఠశాల భవనాన్ని నిర్మించాను. నిరుపేద విద్యార్థులకు సేవలందించాలనే ఆలోచనతో పాఠశాల భవనాన్ని నిర్మించాను.
– ఎమ్మెల్సీ కె.నవీన్ కుమార్
ఆదర్శ మూర్తి.. నవీన్ కుమార్
ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ ఆదర్శ మూర్తి. ఆయన చేసిన సేవ ఎప్పటికీ మరువ లేనిది. సేవా దృక్పథంతో ముందుకొచ్చి పాఠశాల భవనం నిర్మించడంతో విద్యార్థులకు అదృష్టం వరించినట్లు అయింది. రూ.90 లక్షలతో పాఠశాల భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి, నేడు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ఆయన సేవలను ఎన్నటికీ మరువలేము.
– పాఠశాల ప్రధానోపాధ్యాయులు దోసాడ నర్సింహులు
పాఠశాల భవన నిర్మాణం ఇలా….
నిర్మాణ స్థలం : 294 చదరపు గజాలు
నిర్మాణ వ్యయం : 90 లక్షలు
నిర్మించిన అంతస్తులు : గ్రౌండ్ ఫ్లోర్,
మొదటి ఫ్లోర్, రెండో ఫ్లోర్
ఫ్లోర్‌కు స్కేర్ ఫీట్స్ ఎంత : 2500
విద్యార్థుల సంఖ్య : 210
తరగతులు : 1 నుంచి 5 వరకు