మేడ్చల్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు నత్తనడకన జరుగుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో మొదటి దశలో 300 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా.. ఈ ఏడాది జనవరి 15న లబ్ధిదారులకు అధికారులు మంజూరు పత్రాలను అందజేశారు. అయితే 5 నెలల్లో 12 ఇండ్లు మాత్రమే స్లాబ్ లెవల్‌కు వచ్చాయి. దీంతో మిగతా ఇండ్ల నిర్మాణాలపై సందిగ్దం నెలకొంది.
జిల్లాలో ఇప్పటివరకు 1,617 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 615 గ్రౌండింగ్ పూర్తికాగా వాటిలో రూఫ్ లెవల్‌కు 20 ఇండ్లు చేరుకోగా, 12 ఇండ్లు స్లాబ్ లెవల్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పనులు నత్తనడకన సాగడానికి ప్రభుత్వ నిబంధనలే కారణమని లబ్ధిదారులు వాపోతున్నారు. 70 గజాలకు అటుఇటు మించకుండా ఇంటిని నిర్మించినట్లయితే దశలవారీగా రూ.5 లక్షలు మంజూరు చేస్తామని నిబంధనల్లో ఉండగా.. అంత తక్కువ స్థలంలో ఎలా నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులు ఆలోచనలో పడ్డారు. దీంతో కొందరు ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనప్పటికీ నిర్మాణానికి ముందుకు రావాడం లేదని తెలుస్తోంది.