హైదరాబాద్ : హైదరాబాద్, జనవరి 19 : వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి)లో భాగంగా చేపట్టిన బహదూర్ పుర ఫ్లైఓవర్, ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు చేపట్టిన 4.08 కిలోమీటర్ల అతిపెద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేసి, లక్ష్యానికన్నా ముందుగానే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
బహదూర్ పుర జంక్షన్ లో చేపట్టిన పలు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ..రూ. 69 కోట్ల వ్యయంతో చేపట్టిన 690 మీటర్ల పొడవుగల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఈ మార్చ్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా, హైదరాబాద్ ఓల్డ్ సిటీ వాసులకు, ముఖ్యంగా జూ పార్క్ సందర్శకులకు ఎంతగానో ఉపయోగపడే ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు నిర్మిస్తున్న అతిపొడవైన ఫ్లై ఓవర్ పనులను కూడా నియమిత లక్ష్యానికన్నా ముందుగానే పూర్తి చేయాలన్నారు.
ఆరాంఘర్- జూపార్క్ ఆరులేన్ల ఫ్లైఓవర్ నిర్మాణం పనులు ఏవిధమైన అవాంతరాలు లేకుండా జరిగేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ, అనుబంధ బయోడైవర్సిటీ, జలమండలి తదిర విభాగాలతో సమన్వయంతో పని చేయాలని సోమేశ్ కుమార్ ఆదేశించారు.
కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఈఎన్సీ జియాఉద్దీన్, ప్రాజెక్టు సీఈ దేవానంద్, చార్మినార్ జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్, ఎస్.ఈ. దత్తు పంత్ తదితర అధికారులు పాల్గొన్నారు.