Kondapur | కొండాపూర్, ఫిబ్రవరి 27 : అక్రమ నిర్మాణాలకు కాదేది అడ్డు అన్న చందంగా శేర్లింగంపల్లి సర్కిల్ – 20 పరిధిలోని కొండాపూర్ డివిజన్ ప్రేమనగర్ బి బ్లాక్‌లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ విభాగాల అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇష్టానుసారంగా నిర్మాణాలు సాగిస్తున్నారు.
ఏకంగా ఒక నిర్మాణదారుడు విద్యుత్ స్తంభాన్ని స్లాబ్‌లో కలుపుకొని నిర్మించడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఫిర్యాదు చేసినప్పుడే టౌన్ ప్లానింగ్ అధికారులు తూతూ మంత్రంగా హడావిడి చేసి వదిలి పెడుతుండటంతో అక్రమ నిర్మాణదారులు రెచ్చిపోతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ రోడ్లను ఆక్రమిస్తూ చేపడుతున్న నిర్మాణాలకు కనీసం పార్కింగ్ స్థలాలు ఉండవని, ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్స్ వెళ్లేందుకు కూడా దారి ఉండడం లేదని వాపోయారు. ఇటీవలే మార్తాండ నగర్లో రాత్రి సమయంలో గుండె పోటుకు గురైన వ్యక్తిని సరైన సమయంలో హాస్పిటల్‌కి తీసుకెళ్లే దారి లేక, ఆలస్యంగా తీసుకెళ్లడంతో ప్రాణాలు వదిలిన ఘటన చోటు చేసుకుంది. ఇకనైనా సంబంధిత శాఖల అధికారులు తమ చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణాలపై కొరడా జరిపించాలంటే కాలనీవాసులు కోరుతున్నారు.