నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మే 15 (నమస్తే తెలంగాణ) : బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో కానిస్టేబుల్ వరదరాజ్ సుదేష్ అలియాస్ ఉమేష్ (39)కు కోర్టు 30 ఏండ్ల జైలుశిక్ష విధించింది. జైలుశిక్షతోపాటు 12వేల జరిమానా చెల్లించాలని నాంపల్లిలోని ప్రత్యేక పోక్సోకోర్టు జడ్జి ఉదయ్‌భాస్కర్‌రావు శుక్రవారం తీర్పు వెల్లడించారు. బాధిత బాలికకు రూ.లక్ష పరిహారం చెల్లించాలని హైదరాబాద్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మారెళ్ల రమాదేవి కథనం ప్రకారం.. 2020లో వరుసకు మామ అయిన కానిస్టేబుల్ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. టీ ఇవ్వమని అమ్మమ్మ బాధిత బాలికను కోరగా సదరు బాలిక మొదటి అంతస్తులో ఉన్న గదిలోకి వెళ్లడంతో తలుపులు మూసి బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇతరులకు చెబితే బాధిత బాలిక సోదరుడిపై గంజాయి కేసు నమోదు చేయిస్తానని బెదిరించినట్టు తెలిపారు.
ఈ ఘటన గురించి నిందితుడి భార్యకు వివరించగా ఆమె సైతం బాలికపై బెదిరింపులకు పాల్పడినట్టు వివరించారు. భయంతో బాలిక మౌనం పాటించడాన్ని ఆసరాగా తీసుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిపారు. దీంతో ధైర్యంగా బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్టు బాధిత బాలిక తల్లి తెలిపింది. 12ఏళ్ల మైనర్ బాలిక వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేసి సాక్ష్యాధారాలను సేకరించి కోర్టుకు చార్జీషీట్ సమర్పించారు. సుధీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు నిందితుడు నేరం చేసినట్టు రుజువుకావడంతో శిక్ష ఖరారు చేశారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా జైలుశిక్షను అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో వెల్లడించారు.