శంషాబాద్ రూరల్, మే 25: హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిలో ట్రాఫిక్ క్ల్లియర్ చేస్తుండగా లారీ ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందగా మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేందర్‌రెడ్డి వివరాల ప్రకారం హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిలో శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద ఎంహెచ్ 04జేయూ 8209 నంబర్ గల లారీ అదుపు తప్పి రోడ్డు కిందకు వెళ్లిందని 100 డయల్‌కు కాల్ రావడంతో పెట్రోల్ మొబైల్ 1 సిబ్బంది డి.విజయ్‌కుమార్(హెచ్‌సీ-3653), డి.చెన్నయ్య(హెచ్‌సీ-1180) స్పందించి వెంటనే అక్కడికి చేరుకున్నారు.
అదే సమయంలో హైవే ట్రాఫిక్ ముబైల్ సిబ్బంది యాదయ్య(ఏఆర్‌హెచ్‌సీ-1040), డ్రైవర్ శ్రీనివాస్(హెచ్‌జీ-1969) సైతం వచ్చారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు యత్నిస్తుండగా రాత్రి 10.45 గంటల సమయంలో షాద్‌నగర్ నుంచి శంషాబాద్ వైపు కేఏ 56 6430 నంబర్‌గల లారీని డ్రైవర్ అతివేగంగా అజాగ్రతగా నడిపి పోలీస్ సిబ్బందిపై దూసుకు వచ్చి ముగ్గురిని ఢీకొట్టింది. శంషాబాద్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ డి. విజయ్ కుమార్(హెచ్‌సీ- 3653) అక్కడిక్కడే మృతి చెందగా.. మిగతావారు తీవ్ర గాయాల పాలయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న శంషాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మదాపూర్‌లోని యశోద దవాఖానకు తరలించారు. మృతి చెందిన కానిస్టేబుల్‌ను ఉస్మానియాకు తరలించారు. లారీ డ్రైవర్ రమేశ్ కుంబ్లేను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించినట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే విధి నిర్వహణలో మృతి చెందిన విజయ్‌కుమార్(40) అంత్యక్రియలు అతడి స్వగ్రామం షాబాద్ మండలంలోని కుర్వగూడలో అధికార లాంఛనాలతో పూర్తి చేశారు.