సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ భూ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నారు. యూనివర్సిటీల భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు నడుం బిగిస్తున్నారు. యూనివర్సిటీ అభివృద్ధి, విద్యావ్యవస్థ పురోభివృద్ధికి దోహదపడేందుకు కేటాయించిన భూములపై కన్నేసిన కాంగ్రెస్ సర్కారుకు విద్యార్థుల సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనివర్సిటీలో ఆందోళనలు చేపట్టారు.
మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ భూములను స్వాధీనం చేసుకుంటామని రంగారెడ్డి కలెక్టర్ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు కేటాయించిన భూములను రియల్ ఎస్టేట్ పరం చేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి విద్యా సంస్థలకు కేటాయించిన భూములను అన్యాక్రాంతం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలను భగ్నం చేస్తూ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూముల జోలికి వస్తే విద్యార్థి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
మౌలానా ఆజాద్ యూనివర్సిటీలోని 50 ఎకరాల భూమిని రియల్ మాఫియాకు అప్పగించే కుట్ర చేస్తున్న రేవంత్‌రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు అన్ని వర్గాల సహకారం తీసుకుంటామని విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వ భూ మాఫియాను నిరసిస్తూ చేపట్టే నిరసన కార్యక్రమాలకు సంబంధించి భవిష్యత్తు కార్యచరణను త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేస్తున్నారు. యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై ప్రశ్నించేందుకు ఇప్పటికే స్టూడెంట్స్ యూనియన్ ఉందని.. భూముల పరిరక్షణ కోసం టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో పాటు విద్యార్థులంతా భాగస్వాములయ్యేలా జాయింట్ యాక్షన్ కమిటీని రూపొందిస్తామంటున్నారు.
కాంగ్రెస్ సర్కారు కుట్రలను తిప్పికొట్టేందుకు అన్ని వర్గాల వారు తమతో కలిసి రావాలని కోరుతున్నారు. ప్రతిపక్షాలు, విపక్షాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు తమ ఉద్యమానికి మద్దతుగా నిలవాలని పిలుపునిస్తున్నారు. విలువైన భూములను రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు కలిసి రావాలని కోరుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై కన్నేసి విఫలమైన రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి మరోసారి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందంటున్నారు. విద్యా శాఖ మంత్రిగా ఉంటూ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్న రేవంత్‌రెడ్డికి విద్యార్థుల సత్తా చూపించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.