సిటీబ్యూరో, నవంబర్ 8(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ వేదికగా కాంగ్రెస్ అసలు రంగు బయటపడుతున్నది. నీళ్లకు నీళ్లు, పాలకు పాలు అన్నట్లుగా మంచి చెడూ తేటతెల్లం అవుతుంది. ఓట్ల కోసం మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ వాడుకున్న తీరుతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మైనారిటీలపై ఆధిపత్యం కోసం ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతుండటాన్ని ఓటర్లు జీర్ణించుకోవడం లేదు. అసలు రంగును గుర్తించి, నగరాభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ సేవలను మరిచిపోని మైనారిటీలు ఒక్కొక్కరిగా ఆ రెండు పార్టీలకు దూరమవుతున్నారు.
జూబ్లీహిల్స్ రాజకీయ పరిస్థితులు, మైనారిటీల పట్ల బీఆర్ఎస్ స్నేహపూర్వక వైఖరి, ఆ వర్గానికి అందించిన సంక్షేమ పథకాలతో మెజారిటీ ఓటర్లు కారు పార్టీకి గడిచిన ప్రతి ఒక్క ఎన్నికలో మద్దతునిచ్చి గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలను కేవలం ఓటర్లుగానే భావిస్తున్నది. దీంతో మైనారిటీల ఆత్మాభిమానాన్ని ప్రశ్నించేలా రేవంత్ చేసిన వ్యాఖ్యలను, ఇన్నాళ్లు మైనారిటీలను పావులుగా చూసిన ఎంఐఎం తీరును ఎండగడుతున్నారు. 30-35 శాతం మైనారిటీ ఓటర్లుండటం వల్ల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్న కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను మైనారిటీలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నది వాస్తవమనే చెప్పాలి.
అగ్గి రాజేస్తున్న మంత్రి పదవి..
రెండేళ్లలో పార్టీలో ఉన్న మైనారిటీ నేతలను రేవంత్ రెడ్డి గుర్తించలేదు. పార్టీలో సీనియర్ లీడర్‌గా గుర్తింపు ఉండి, పీసీసీ మాజీ చీఫ్ స్థాయిలో ఆ పార్టీలో సేవలందించిన షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి బృందం వేధింపులకు గురిచేసింది. కానీ ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ పాలన తీరుకు రెఫరెండంగా మారడంతో హడావుడిగా మైనారిటీ నేత అజహరుద్దీన్‌కు మైనారిటీ కోటా మంత్రి పదవిని కట్టబెట్టాడు. పరిస్థితి దారుణంగా మారడంతో ఇన్నాళ్లు గ్రేటర్ పరిధిలో ఇతర ముస్లిం నాయకులకు గుర్తింపు లేకుండా చేసిన ఎంఐఎం పార్టీని కాదని ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకున్నారు.
ఇదే ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. గతంలో ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్ అభ్యర్థిని నిలిపితే, ఎంఐఎం కూడా నవీన్యాదవ్ను బరిలోకి దింపింది. కానీ ఇప్పుడు మనుగడ కోసం కాంగ్రెస్, ఎంఐఎం కలిసి బీఆర్ఎస్పై కత్తి కట్టాయి. అదే అజహరుద్దీన్‌కు అప్పుడు సహకరించని ఎంఐఎం ఇప్పుడు నవీన్‌యాదవ్‌కు మద్దతు ఇవ్వడాన్ని మైనారిటీలు జీర్ణించుకోవడం లేదు. అందుకే ముస్లింలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఏక వాక్య తీర్మానంతో…
కాంగ్రెస్ పాలనలో మైనారిటీలు ఎదుర్కొంటున్న అవమానాలను బీఆర్ఎస్ సర్కారు గుర్తించింది. అందుకే జూబ్లీహిల్స్ వేదికగా ఓట్ల కోసం గల్లీ గల్లీ తిరుగుతున్న కాంగ్రెస్ నేతలను నిలదీసింది. మెజారిటీ ఓటర్లు ఉన్న మైనారిటీలకు ప్రాతినిధ్యం వహించే నాయకుడు లేకుండా చేశాడని మండిపడింది. కేవలం చివరకు మత రాజకీయాలకు పాల్పడుతుందంటూ ఎంఐఎంను విమర్శించిన కాంగ్రెస్ నాయకులు.. ఇవాళ వారి మద్దతు కోరడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతోనే మైనారిటీలందరూ ఏక వ్యాఖ్య తీర్మానంతో బీఆర్ఎస్ వైపు నిలబడుతున్నారు.