Power Cuts | సమైక్య పాలనలో కరెంటు ఎప్పుడు వచ్చేదో..ఎప్పుడు పోయేదో తెలియకపోయేది.. పరిశ్రమలకు పవర్ హాలీడేలూ ఉండేవి. ఆ చీకటి రోజుల నుంచి .. స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ వెలుగు దివ్వెగా మారింది. పదేండ్లలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాలతోపాటు గృహావసరాలకు కూడా 24 గంటలూ.. నాణ్యమైన కరెంట్ అందించింది కేసీఆర్ సర్కారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన ఆరేడు నెలల్లోనే విద్యుత్ రంగం గాడి తప్పింది. ఉమ్మడి పాలనలోని కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ముఖ్యంగా పవర్ కట్లతో పారిశ్రామిక రంగం కుదేలవుతున్నది. పారిశ్రామికవేత్తలు, చిరువ్యాపారులు, కుటీర పరిశ్రమలు యంత్రాలను నడిపించి జీవనోపాధి పొందే వారు తీవ్రంగా నష్టపోతున్నారు.
– సిటీబ్యూరో/నెట్వర్క్
కాంగ్రెస్ పరిపాలన అంటేనే కరెంటు కోతలు. ఇది నా చిన్నతనం నుంచి చూస్తున్నా. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కరెంటు కోతలు లేవు. కానీ మళ్లీ పాత రోజులు గుర్తుకు తెచ్చేలా.. కోతలు ప్రారంభమయ్యాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. కరెంటు ఉంటేనే యంత్రాలు నడుస్తున్నాయి. లేదంటే తిరిగి సమస్యలు గతంలో లాగానే ఉంటాయి.
మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్. పరిశ్రమలు, చిరు వ్యాపారాలు బాగుపడుతాయని భావించి.. నిరంతరాయంగా కరెంటు సరఫరా అందించారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా అందరికీ విద్యుత్‌ను అందించారు. కేసీఆర్ ప్రభుత్వం లేకపోవడంతో పదేండ్ల ముందు ఎట్ల ఉండేనో.. ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది.
ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం, అధికారులతో సమన్వయ లోపం కారణంగానే పదేండ్ల తరువాత మళ్లీ కరెంటు కోతలు చూడాల్సి వస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం మండు వేసవిలోనూ విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తే కాంగ్రెస్ సర్కారు రాగానే పరిస్థితి మారిపోయింది.
కరెంటు సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే పట్టించుకునే వారే కరువయ్యారు. చిన్న పాటి వర్షం పడినా.. కరెంటు తీసేస్తున్నారు. కరెంటు పోతే ఫిర్యాదు చేస్తే..గంటల తరబడి సమస్యను పరిష్కరించడం లేదు. పదేండ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయి. వ్యాపారాలు, హోటళ్ల నిర్వహణ కష్టంగా మారే అవకాశమున్నది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు మొదలయ్యాయి. వేళాపాళా లేకుండా ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. కంప్యూటర్ ఆపరేటర్‌గా జీవనోపాధి పొందుతున్న మాలాంటి వారికి ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిరంతరం కరెంటు సరఫరా చేయాలి.