సిటీ బ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన వెంటనే కాంగ్రెస్ రౌడీయిజం మొదలు పెట్టింది. గెలిచి 24 గంటలు గడవకముందే సామాన్యులపై దాడులకు తెరతీసింది. జూబ్లీహిల్స్ ప్రజలు ముందుగా ఊహించినట్లుగానే కాంగ్రెస్ గెలిస్తే రౌడీయిజం రాజ్యమేలుతున్నది. సామాన్య ప్రజల నుంచి వ్యాపారుల దాకా కాంగ్రెస్ గూండాగిరి చూసి హడలెత్తిపోతున్నారు. ఎన్నికల ముందు అధికారం అడ్డుపెట్టుకుని ఓటర్లను బెదిరింపులకు గురిచేసి ఓట్లేయించుకున్నారు. పోలీసుల ముందే కాంగ్రెస్ కార్యకర్తలు ఓటేయకుంటే అంతు చూస్తామంటూ హెచ్చిరించి బలవంతంగా కాంగ్రెస్‌ను గెలిపించుకున్నారు. గెలిచిన వెంటనే తమ గూండాగిరిని షురూ చేశారు. శుక్రవారం ఫలితాలు విడుదల కాగానే తమ అరాచకత్వానికి తెర తీశారు.
రహ్మత్‌నగర్‌కు చెందిన రాకేశ్ క్రిస్టోఫర్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను అర్ధరాత్రి వెంబడించి దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేయడానికి ఎంత ధైర్యం? అంటూ దౌర్జన్యానికి దిగారు. రాఖీ అనే రౌడీతో పాటు మరికొంతమంది రాకేశ్‌పై దాడి చేశారు. నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ ఇష్టారీతిన కొట్టారు. ఇంకెప్పుడూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడినా.. బీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడినా బతకనివ్వమంటూ హెచ్చరించారు. జూబ్లీహిల్స్‌లో ఇక నుంచి తిరగాలంటే బీఆర్ఎస్ పేరు ఎత్తకూడదంటూ హుకూం జారీ చేశారు. రాకేశ్‌పై దాడి జరగటంతో జూబ్లీహిల్స్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గెలిచిన తొలి రోజు నుంచే రౌడీయిజం మొదలుపెట్టారని.. మరో మూడేండ్ల పాటు తమ పరిస్థితేంటని భయభ్రాంతులకు గురవుతున్నారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నేతలు, నవీన్ యాదవ్ అనుచరులు అరాచకానికి తెర తీశారు. గెలిచిన మొదటి రోజు నుంచే రౌడీయిజం, గూండాగిరి మొదలు పెట్టారు. నామినేషన్ల ప్రక్రియ నుంచే కాంగ్రెస్ అరాచకాలకు నాంది పలికింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజలను బెదిరింపులకు గురి చేసి ఓట్లేయించుకుని గెలిపొందింది. గెలిచిన తొలిరోజు నుంచి పైశాచికత్వం ప్రదర్శిస్తున్నది. శుక్రవారం సాయంత్రం బీఆర్ఎస్ గుర్తు అయిన కారును వేలాడదీసి, దాన్ని కింద పడేస్తూ పైశాచికానందం పొందారు. కారును నేలకేసి బాదుతూ, తన్నుతూ ఇష్టారీతిన క్రూరత్వం ప్రదర్శించారు. ఇన్నేండ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇంత అరాచకత్వం ఎన్నడూ జరగలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. నవీన్ యాదవ్.. తండ్రి శ్రీశైలం యాదవ్ అండదండలతో అరాచకాలు ప్రారంభించారు. బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉన్నా కాంగ్రెస్, బీజేపీ గుర్తులను అవమానించలేదు. గెలుపు ఓటముల తర్వాత ప్రతీకారాలకు పోలేదు. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం దేశంలో ఎక్కడా లేనివిధంగా కాంగ్రెస్ పరువు తీస్తున్నారని ఆ పార్టీ సీనియర్లే చెబుతున్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలు, నవీన్ యాదవ్ అనుచరుల అరాచకత్వాలపై జూబ్లీహిల్స్ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలపై దౌర్జన్యాలను అప్పుడే మొదలు పెట్టారంటూ చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తపై అర్ధరాత్రి దాడితో ప్రజలు పానిక్ అవుతున్నారు. వచ్చే మూడేండ్లలో ఇలాంటి దాడులు ఇంకెన్ని చూడాలో అనుకుంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు. సామాన్య ప్రజల నుంచి వ్యాపారవేత్తల దాకా కాంగ్రెస్ కార్యకర్తలు, నవీన్ యాదవ్ అనుచరుల చెప్పుచేతల్లో ఉండాల్సిందేనని ఆందోళన చెందుతున్నారు.
ఇక నుంచి జూబ్లీహిల్స్ బస్తీల్లో దాడులు, అరాచకాలు నిత్య కృత్యం కానున్నట్లు స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. రౌడీలు, గూండాలు పేట్రేగిపోతారంటూ వణికిపోతున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనతో మాగంటి గోపీనాథ్ తమను కడుపులో పెట్టుకుని చూసుకున్నారని.. ఇక నుంచి తమ బతుకులు ఎలా మారుతాయోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్తీల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే దీనిపైనే మాట్లాడుకుంటున్నారు. కూడళ్లు, టీ దుకాణాలు, అడ్డాల్లో ఏ నలుగురు కలిసినా దీనిపైనే చర్చించకుంటున్నారు. నవీన్ యాదవ్ రౌడీయిజానికి ఇక రాజకీయం, అధికారం తోడైందని అభిప్రాయపడుతున్నారు. మూడేండ్లు జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయే ఛాన్సులు బలంగా ఉన్నాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.