మణికొండ, నవంబర్ 16: రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి నేతృత్వంలో శనివారం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్యాద్రినాయుడు, భాస్కర్‌గౌడ్, షేక్ ఆరీఫ్, వెంకటేశ్‌తో పాటు 350 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో శనివారం తెలంగాణభవన్‌లో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ ‘రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి అతిపెద్ద మెజార్టీతో రెండుసార్లు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ను గెలిపించాం.
ఎవరూ సొంత శక్తితో గెలిచిన వారే కాదు.. కేసీఆర్ వంటి శక్తి వెనుకాల ఉండకపోతే కేవలం వార్డు మెంబర్‌గా కూడా వారు గెలవకపోతుండే. నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పి పార్టీ మారారో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఇప్పటికీ స్పష్టంగా ప్రజలకు చెప్పలేద’న్నారు. నాలుగేండ్ల అధికారం ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు పనికిరాదని ముందే గుర్తించి.. బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వచ్చిన నాయకులందరికీ భవిష్యత్‌లోనూ సముచితమైన స్థానం, గౌరవాన్ని అందిస్తామని కార్తీక్‌రెడ్డి స్పష్టం చేశారు. పదేండ్లు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను చూస్తుంటే తనకు బాధేస్తున్నదని, వారంతా జెండా కూలీలుగా మారారని, వారిని చూస్తే జాలేస్తున్నదని కార్తీక్‌రెడ్డి అన్నారు. కనీసం కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకోని వారు సైతం నామినేటెడ్ పదవులు తీసుకుంటున్నారని గుర్తుచేశారు.
ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీకి ఐదు సీట్లు కూడా సరిగ్గా రావని కార్తీక్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, కీర్తీలతాగౌడ్, రూపారెడ్డి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.