జూబ్లీహిల్స్, సెప్టెంబర్ 20: జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌లో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. అసెంబ్లీ బై ఎలక్షన్లో తమకు పక్కా టికెట్ కేటాయిస్తున్నారనుకున్న నేతల ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లడంతో వారు.. తమ అసంతృప్తిని బహింరంగంగానే ప్రదర్శిస్తున్నారు. యూసుఫ్‌గూడలో శనివారం జరిగిన పొదుపు సంఘాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హస్తం పార్టీ నుంచి జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు డుమ్మా కొట్టారు.
స్థానిక కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ జిల్లా స్వయం సహాయక మహిళా సంఘాలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, సీతక్కతో కలిసి వడ్డీలేని రుణాల పంపిణీ పేరుమీద రూ.41.51 కోట్ల చెక్కును అందజేశారు. అయితే ఎలక్షన్ స్టంట్‌గా మారిన ఈ సభలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో టికెట్ ఖరారయ్యిందనుకున్న నవీన్ యాదవ్, ఎమ్మెల్సీగా ప్రకటించిన అజరుద్దీన్‌తో పాటు ఇప్పటికీ టికెట్ ఆశిస్తున్న సీఎన్ రెడ్డి తదితరులు హాజరుకాగా టికెట్ రేసులో ఉన్నానని ప్రకటించుకున్న మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌తో పాటు రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా గైర్హాజరవ్వడం కాంగ్రెస్‌లోని వర్గపోరును మరోసారి బహిర్గతం చేసింది.
బీఆర్ఎస్ హయాంలో పొదుపు సంఘాలకు ప్రోత్సాహం..
బీఆర్ఎస్ హయాంలో పొదుపు సంఘాలకు భారీగా ప్రోత్సాహం దక్కింది. జీహెచ్ఎంసీ అర్బన్ కమ్యునిటీ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో తొలిసారి 10 మంది ఉన్న సభ్యులకు రూ.లక్ష రుణంతో ప్రారంభించిన గ్రూపులకు విడతలవారీగా రూ.10 నుంచి 20 లక్షల వరకు రుణాలిచ్చారు. ఆయా పొదుపు సంఘాలు పొందిన రుణాలు ఇప్పటికీ చెల్లిస్తున్నారు. సదరు రుణాలు తిరిగిచెల్లించిన తరువాత సంబంధిత బ్యాంకులు పరిమితిని పెంచి రుణాలిస్తుంటారు.
అయితే జూబ్లీహిల్స్ ఎన్నికలు సమీపిస్తుండడంతో మహిళలను కాంగ్రెస్ కబ్జాలో ఉంచుకునేందుకు పొదుపు సంఘాలకు రుణాల పంపిణీ అంటూ స్టంట్ చేశారు. ఎందుకు వచ్చామో తెలియదని కొంతమంది.. రమ్మన్నారు కాబట్టి వచ్చామని మరికొంత మంది.. పావలా వడ్డీ పోయి రూపాయి పావలా పడుతుందని మహిళా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా టికెట్ ఆశిస్తున్న వారిలో ప్రముఖంగా వినపడుతున్న పేర్లలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం మాదాపూర్‌లోని ఒక హోటల్లో జూబ్లీహిల్స్‌లో అంతామేమే అని చెప్పుకునే మీడియా బృందానికి విందు ఏర్పాటుచేసి బహుమానాలు అందజేసి తెరవెనుక టికెట్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.