మేడ్చల్ /మేడ్చల్ రూరల్/ శామీర్‌పేట /ఘట్కేసర్ /కీసర, జనవరి 26 : ప్రజాపాలన అని గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సామాన్యులు, ప్రతిపక్ష పార్టీల నేతలకు అవమానం జరుగుతున్నది. అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు దౌర్జన్యం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శామీర్‌పేట మండలం పొన్నాల గ్రామంలో ఆదివారం నిర్వహించిన 4 పథకాల ప్రారంభోత్సవ సభ రసాభాసగా సాగింది. కాంగ్రెస్ నేతల దౌర్జన్యం, దాడులకు పాల్పడే స్థాయిలో వ్యవహరించారు. గ్రామసభలో ప్రారంభోత్సవం తర్వాత ప్రజలు మాట్లాడవచ్చునని ప్రత్యేక అధికారి చెప్పడంతో రామలింగేశ్వరస్వామి దేవాలయ మాజీ డైరెక్టర్ వేణుగౌడ్ లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, నిజమైన అర్హులకు కాకుండా కాంగ్రెస్ శ్రేణులకే కేటాయింపులు జరిగాయని ఆరోపించారు.
ఎలాంటి తప్పులు జరగనప్పుడు లబ్ధిదారుల ఎంపికలో జాబితాను ఇవ్వడానికి అధికారులు, కాంగ్రెస్ శ్రేణులకు ఇబ్బందులు ఎందుకని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ నేతలు ప్రభాకర్‌గౌడ్, జీడిపల్లి వేణుగోపాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి అక్కసు వెళ్లగక్కారు. దాడి చేసేంత పని చేశారు. పోలీసులు సైతం ప్రశ్నించిన నేతలను సభ నుంచి బయటకి లాక్కెళ్లారు. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే మైకులు ఎవడిచ్చాడురా ? ఎందుకిచ్చారు ఆ మైకును లాక్కోండి అంటూ సభ ముఖంగా మండల ప్రత్యేక అధికారే కేకలు వేయడం చర్చనీయాంశంగా మారింది.
సభకు ముందుకు కాంగ్రెస్ నేతలకు వేదికపై సీటు కేటాయించలేదని నానా హైరానా చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలమని తమకు కొత్తగా అధికారులు గుర్తింపు ఇవ్వనమసరం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, జడ్పీటీసీలుగా పదవులు అనుభవించామని అధికారులు గుర్తింపుతో మాకేం పని అని మండిపడ్డారు. పోలీసు పహారాలో లబ్ధిదారులకు అర్హత పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జవహర్‌నగర్ మేయర్ శాంతికోటేశ్, మండల ప్రత్యేక అధికారి శంకర్‌కుమార్, సభ ప్రత్యేక అధికారి శ్రీధర్, ఎంపీడీవో మమతాబాయి, తహసీల్దార్ యాదగిరిరెడ్డి, పొన్నాల్ ఏఎంసీ చైర్మన్ నర్సింహులు యాదవ్, జడ్పీ సీఈవో నీరజ్, ప్రత్యేక అధికారి సైదులు, ఎంపీడీవో వత్సలాదేవి, తాసీల్దార్ వెంకటనర్సింహారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ హనుమంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అర్హత గలవారందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్‌రెడ్డి తెలిపారు. భోగారంలోని అన్నపూర్ణ ఫంక్షన్హాల్లో గ్రామసభను నిర్వహించారు. రేషన్‌కార్డులు 244కి గాను 158, ఇందిరమ్మ ఇండ్లు 200 మందికి, ఆత్మీయ భరోసా కింద 36 మంది మహిళలు, రైతు భరోసా కింద 408 మందికి మంజూరీ పత్రాలను పంపిణీ చేశారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ విడతల వారీగా అర్హులైన వారందరికీ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్‌రెడ్డి, కీసర మండల తహసీల్దార్ అశోక్కుమార్తతదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్ : సోమారం గ్రామంలో అధికారులు ప్రజా పాలన గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారులకు పథకాల మంజూరీ పత్రాలను పంపిణీ చేశారు. గ్రామంలో 61 మంది ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోగా 27 మందిని ఎంపిక చేశారు. రేషన్ కార్డులకు 77 మంది దరఖాస్తు చేసుకోగా 60 మందిని ఎంపిక చేశారు. వీరితో పాటు 7 మందికి ఆత్మీయ భరోసా, 138 రైతు భరోసా మంజూరీ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో కాంతమ్మ, తహసీల్దార్ శైలజ, ఎంపీడీవో వసంత లక్ష్మీ, ఏడీఏ వెంకట్రాంరెడ్డి, మండల వ్యవసాయ అధికారి అర్చన, మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ దీపికా నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాల అమలు రాష్ట్ర ఆదాయాన్ని బట్టి పూర్తి అవుతుందని, ప్రజల ఆందోళన పడకుండా వచ్చే వరకు చూడాలని ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ ఘనపూర్ గ్రామంలో ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులను అర్హులైన లబ్ధిదారులకు ప్రజా పాలన ప్రత్యేకాధికారి శశాంక్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతంలతో కలిసి మంజూరీ పత్రాలను అందజేశారు. ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘట్కేసర్లో ప్రజాపాలన సభలు ఏకపక్షంగా జరుగుతున్నాయని మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్‌రెడ్డి విమర్శించారు. ఘనపూర్ గ్రామంలో పథకాల పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఉపన్యాసాన్ని అడ్డుకుని అనర్హులకు పథకాలను అందజేస్తున్నారని కలెక్టర్‌ను ప్రశ్నించారు. ప్రజాపాలన పథకాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారా లేక కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహిస్తున్నారా అని నిలదీశారు. పోలీసులు మహిపాల్ రెడ్డిని అడ్డుకుని కూర్చోబెట్టారు.