BRS | రంగారెడ్డి, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద బైఠాయించిన ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన సందర్భంలో పోలీసులు హైడ్రామా నడిపారు. మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను అరెస్టు చేసిన పోలీసులు గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో రెండు వాహనాల్లో తీసుకెళ్లారు.
అయితే బీఆర్ఎస్ నేతలను శ్రీశైలం హైవే మీదుగా తీసుకెళ్తున్నట్లు సమాచారం తెలియడంతో బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున రోడ్లపైకి తరలివచ్చారు. అడుగడుగునా పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒక వాహనాన్ని తలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హరీశ్‌రావు ఉన్న మరో వాహనాన్ని షాద్ నగర్ వైపుగా మళ్లించారు. ఈ క్రమంలో కేశంపేట మండలం కొత్తపేట వద్ద రోడ్డుపై టైర్లను అడ్డంగా పెట్టి పోలీసు వాహనాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఉద్రిక్తతల నడుమ కేశంపేట పోలీస్‌స్టేషన్‌కు హరీశ్‌రావు, ఇతర నేతలను పోలీసులు తరలించారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు తరలిరావడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీచార్జీ చేశారు. చివరకు పోలీసులు ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్‌ను కేశంపేట పోలీస్‌స్టేషన్ లోపలికి తరలించారు.
తలకొండపల్లి పీఎస్‌కు తరలించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గురువారం రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు విడుదల చేశారు. సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. విడుదలైన ఎమ్మెల్యేలు వివేకానంద్, బండారి లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి సొంత వాహనాల్లో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.