MLA Arekapudi Gandhi | సిటీ రౌడీ రాజకీయాలకు అడ్డాగా మారిందా.. ? హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయా..? అంటే అవుననే సమాధానం వస్తున్నది. పట్టపగలు..నగరం నడిబొడ్డున.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ అనుచరులు, కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడటం గురువారం ఉద్రిక్తతతకు దారితీసింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. సవాళ్లు, ప్రతిసవాళ్ల నడుమ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.. కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసానికి తన అనుచరులతో కలిసి వచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
అయితే అప్పటికే కౌశిక్‌రెడ్డి హౌస్ అరెస్టులో ఉండగా, గాంధీ అనుచరులు పోలీసులను తోసుకుంటూ.. ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో గేటు దూకి కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి చొచ్చుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు..అక్కడే ఉన్న బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి దిగారు. కుర్చీలన్నీ చెల్లాచెదరు చేసి..కోడిగుడ్లు, టమాటాలు విసిరేసి..ఇంటి అద్దాలు..పూల కుండీలు ధ్వంసం చేసి.. కాంగ్రెస్ శ్రేణులు యుద్ధవాతావరణాన్ని సృష్టించారు. పోలీసులపై చేయిచేసుకున్నారు.
అక్కడే ఉన్న ఎమ్మెల్యే గాంధీ దాడి చేసేలా వారిని ఎగదోశారు. ఇంత జరుగుతున్నా.. గాంధీ అనుచరులు, కాంగ్రెస్ గూండాల దౌర్జన్యాన్ని పోలీసులు నిలువరించలేకపోయారు. ఇదిలా ఉంటే కౌశిక్‌రెడ్డిపై దాడిని ముక్తకంఠంతో ఖండించిన బీఆర్ఎస్ నేతలు.. నిరసనలతో హోరెత్తించారు. ఇదేం ప్రజాపాలన..ఇదేం ఇందిరమ్మ రాజ్యం.. అంటూ.. నిలదీశారు. తెలంగాణను రౌడీ రాజకీయాలకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని నినదించారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భద్రత కరువైందని.. పక్కా ప్రణాళికతోనే దాడి జరిగిందంటూ.. రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజలు సైతం ధ్వజమెత్తారు.
– సిటీబ్యూరో, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ)