ఎల్బీనగర్, ఆగస్టు 20 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓ వైపు వర్గపోరు మరోవైపు పార్టీ పదవుల నియామకాలపై అసంతృప్తులు చేస్తున్న బహిరంగ విమర్శలతో రోజురోజుకు ఆపార్టీ పరిస్థితి పాతాళానికి పడిపోతున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్రస్థాయిలో సీఎం, మంత్రుల మధ్య విభేదాలకు ఏమాత్రం తగ్గని రీతిలో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ప్రథమ, ద్వితీయ శ్రేణి నేతల అంతర్గత కుమ్ములాటలతో పార్టీ గ్రాఫ్ మరింత పడిపోతూ వస్తున్నది అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు జక్కిడి, బుడ్డ సత్యనారాయణ వివాదం చల్లారక ముందే.. తాజాగా డివిజన్ అధ్యక్షుల నియామకంలో పార్టీని నమ్ముకున్నవారికి అన్యాయం జరిగిందంటూ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. వర్గపోరు, పదవుల పంచాయితీ వెరసి నియోజకవర్గంలో ఎవరికివారే.. యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.
ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వివాదాలు రోజురోజుకూ ముదిరిపోతున్నాయి. ఓవైపు గ్రూపు రాజకీయాలు, మరోవైపు పదవుల పంచాయితీ విషయంలో ద్వితీయ శ్రేణి నేతలకు సముదాయించలేక అధిష్టానం తలలు పట్టుకుంటోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎల్బీనగర్ నియోజకవర్గంలో మాత్రం బీఆర్ఎస్ నుంచి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి తృతీయస్థానంతోనే సరిపెట్టుకున్న మధుయాష్కి గౌడ్.. తదనంతరం నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తామంటే తామే అంటూ ద్వితీయస్థాయి నేతలు గ్రూపులు కట్టారు. తెలంగాణ రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి తనదైన శైలిలో వ్యవహరిస్తుండగా, తానే ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్చార్జి అంటూ జక్కిడి ప్రభాకర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇన్ని విచిత్ర పరిణామాల నడుమ ఎవరివెంట నడవాలి.. ఏం చేయాలో తెలియక ఆ పార్టీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అయోమయంలో ఉండిపోతున్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ మహిళా నాయకురాలు పొచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌కు ఇటీవలే యాదాద్రి ట్రస్టు బోర్డు సభ్యురాలుగా పదవి వరించింది. ఈక్రమంలో ఆమె అనుచరులు మన్సూరాబాద్‌లో వేసిన ఫ్లెక్సీలో తమ ఫోటోలు లేవంటూ ఎల్బీనగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, అతని తనయుడు, తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి చేసిన కామెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి.
ఓ దశలో బీసీలపై రెడ్ల దాడిగా దీనిని అభివర్ణిస్తూ అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈశ్వరమ్మ యాదవ్‌కు సంఘీభావం తెలిపాయి. ఈశ్వరమ్మ యాదవ్‌కు మద్దతుగా ఆందోళణకు దిగిన ఆమె అనుచరులు జక్కిడి నివాసంపై రాళ్లదాడి సైతం చేశారు. ఈ క్రమంలోనే జక్కిడి ప్రభాకర్‌రెడ్డికి గతంలో అనుచరుడుగా ఉండి ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా ఉన్న బుడ్డ సత్యనారాయణ.. ఈమధ్య చేసిన కుల ప్రస్తావన కూడా తీవ్ర దుమారానికి దారితీసింది. మొత్తంగా ఈ వ్యవహరంలో ఎల్బీనగర్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట మసకబారిందని ఆ పార్టీలోనే నాయకులు, కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు.
నియోజవర్గంలో కొనసాగుతున్న వివాదాలకు చెక్‌పెట్టేందుకు తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డివిజన్ల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు నేతల మధ్య విభేదాలకు మరింత అగ్గిరాసినైట్లెంది. పలు డివిజన్లలో పార్టీ నాయకులతో సమన్వయం లేనివారిని డివిజన్ల అధ్యక్షులుగా నియమించారంటూ అసంతృప్త వర్గం నేతలు మండిపడుతున్నారు. సాహెబ్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడి విషయంలో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశించిన ఓ మహిళ బహిరంగంగా విడుదల చేసిన వీడియో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తోంది.
డివిజన్ అధ్యక్షుడిగా నియామకమైన వ్యక్తిపై ఉన్న ఎఫ్ఐఆర్ పత్రాన్ని చూపిస్తూ బహిరంగంగా ఆమె రిలీజ్ చేసిన వీడియో సంచలనంగా మారింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఈ విషయంలో దృష్టి సారించాలని ఆమె వీడియోలో కోరింది. ఇలా ఎల్బీనగర్ కాంగ్రెస్‌లో రోజుకో వివాదం చుట్టుముడుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నాయకులే తాము ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. ఇక అధిష్టానం ఈ విషయంలో ఏమైనా స్పందిస్తుందా లేక మాకేమీ సంబంధం.. మీ లొల్లి మీది అంటూ మిన్నకుంటుందా
వేచి చూడాల్సిందే.