Vana Mahotsavam | సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ సర్కారు గ్రేటర్లో కంటి తుడుపు చర్యగా పచ్చదనం పెంపునకు సిద్ధమైంది. వన మహోత్సవం పేరిట ఈ ఏడాది జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 30.81 లక్షల మొక్కలతోనే సరిపెట్టాలని నిర్ణయించింది. కూకట్పల్లి, ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్ జోన్లకు నిర్దేశిత లక్ష్యాలను ఖరారు చేసింది. ఈ మేరకు నేడు అన్ని సర్కిళ్లలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం జరిగే వన మహోత్సవాన్ని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఒక్కరోజే 7,135 మొక్కలను ప్రజాప్రతినిధులతో నాటనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం గంటలకు ఉప్పల్ సర్కిల్ 2, హబ్సిగూడ సర్కిల్ 8 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల రామాంతాపూర్‌లో జరిగే కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి పాల్గొంటారు. పార్కులు, మీడియం, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మొక్కలు ఇస్తారు. అలాగే ఇంటింటికీ మొక్కలను సరఫరా చేయనున్నట్లు అధికారులు చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వంలో వరుసగా 8 సార్లు హరితహారం కింద ప్రతి ఏటా గ్రేటర్లో కోటి మొక్కలను నాటింది. ఖాళీ స్థలాల్లో యాదాద్రి మోడల్ మియవాకి, వర్టికల్, థీమ్ పారులు, మెరిడియన్, అవెన్యూ ప్లాంటేషన్, జంక్షన్ సుందరీకరణ ట్రీ పార్కులు ఇలా రకరకాల పేర్లతో పచ్చదనం, సుందరీకరణ పనులను చేపట్టింది. కాలనీలను పచ్చదనంతో నింపేసింది. ఫలితంగా హైదరాబాద్ మహా నగర పరిధిలో 147 శాతం అటవీ విస్తీర్ణం పెరిగింది.తెలంగాణకు హరితహారం చేపట్టిన తర్వాత అటవీ విస్తీర్ణం 81.81 స్వేర్ కిలోమీటర్లకు పెరిగినట్లు ఎఫ్ఎస్ఐ ప్రకటించింది. ఎఫ్‌ఎస్‌ఐతో పాటు అర్బోర్ డే ఫౌండేషన్ సంస్థ, ఎఫ్ఏవో సంస్థలు 2020 సంవత్సరానికి హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్‌గా గుర్తించింది. పచ్చదనం పెంపునకు గత సర్కారు పెద్దపీట వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూడటం పట్ల పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు.