Harish Rao | మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న రేవంత్ రెడ్డి.. ముందు అంగన్ వాడీలకు జీతాలు చెల్లించి, మహిళల పట్ల నీకున్న గౌరవాన్ని నిలబెట్టుకో అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు హితవు పలికారు. ఈ మేరకు హరీశ్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు.
రెండు నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62వేల అంగన్ వాడీ సోదరీమణుల కష్టాలు మీకు కనిపించడం లేదా..? నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా అంగన్ వాడీలను వేదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా వారి ఉసురు తగులుందన్నారు. మహిళా మంత్రిగా ఉన్న సీతక్క సాటి మహిళల కన్నీటి గోస అర్థం చేసుకోకపోవడం శోచనీయమని హరీశ్ రావు పేర్కొన్నారు.
అంగన్ వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ వారు వర్కర్లు కాదని, అంగన్ వాడీ టీచర్లు అని పోస్టును ఉన్నతీకరించారు. వారి గౌరవాన్ని పెంచారు.2014 నాటికి అంగన్ వాడీ టీచర్లకు కేవలం రూ.4,200, వారి సహాయకులకు రూ.2,200 వేతనం లభించేది. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని రూ.13,650లకు, మినీ అంగన్ వాడీ టీచర్ల వేతనాన్నిరూ.7,800లకు, అంగన్ వాడీ హెల్పర్ల వేతనాన్ని రూ.7,800 లకు పెంచి దేశంలోనే అత్యధికంగా చెల్లించారన్నారు.
ఇచ్చిన హామీకి అతీ లేదు, గతీ లేదు..
అభయహస్తం పేరిట ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని 18,000లకు పెంచుతామని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారు. మాయ మాటలు చెప్పి, రెండున్నరేండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీకి అతీ లేదు, గతీ లేదు. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం, అధికారంలోకి వచ్చాక అబద్దాలు ప్రచారం చేసుకుంటం అన్నట్లుంది కాంగ్రెస్ వైఖరి అని హరీశ్ రావు మండిపడ్డారు.
సమస్యల పరిష్కారం కోసం ఛలో సెక్రటేరియట్ పిలుపునిచ్చిన అంగన్ వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, కర్కషంగా వ్యవహరించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి, మీ పాలనను అన్ని వర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారన్న విషయాన్ని గుర్తించండి. రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్న అంగన్ వాడీల వేతనాలను చెల్లించాలని, అప్ గ్రేడ్ చేసిన మినీ అంగన్ వాడీలకు ఏడాదిగా పెండింగ్ లో ఉన్న పెంచిన వేతనాలను తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

Dubai | దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులు మృతి
Ramchander Rao | ప్రాజెక్టులు సీఎం రేవంత్‌రెడ్డికి ఏటీఎంలుగా మారాయి : రాంచందర్ రావు