సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ప్రజల ఆరోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తన నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ పరిధిలోని ఆయా దవాఖానల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్లోఒ కేటాయింపులు జరగలేదని పలువురు వైద్యసిబ్బంది ఆరోపిస్తున్నారు. దవాఖానల పడకలు పెంచడం, కొత్త భవనాలు, కొత్త వైద్య పరికరాలు, దవాఖానల విస్తరణపై పెద్దగా దృష్టిపెట్టకపోవడం, దవాఖానల అభివృద్ధి కోసం నామ మాత్రపు కేటాయింపులపై రోగులు పెదవి విరుస్తున్నారు.
ఇటీవలే రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కొత్త మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడమే కాకుండా ఉస్మానియా, గాంధీ వంటి స్పెషాలిటీ టీచింగ్ హాస్పిటల్స్ నుంచి పెద్ద ఎత్తున వైద్యాధికారులను ఆయా టీచింగ్ కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా మంజూరైన మెడికల్ కళాశాలలన్నీ ఏరియా, జిల్లా హాస్పిటల్స్‌లలో ఇరుకైన తాత్కాలిక భవనాల్లో నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఈ కొత్త టీచింగ్ హాస్పిటల్స్‌కు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం గమనార్హం.
బడ్జెట్ ప్రసంగంలో ఉస్మానియా నూతన భవన నిర్మాణానికి రూ.2700కోట్లు అంటూ ప్రస్తావించారు కానీ బడ్జెట్ కేటాయింపులో మాత్రం ఉస్మానియా నూతన భవన నిర్మాణాన్ని ప్రస్తావించకపోవడం విడ్డూరం. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాలుగు సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణ పనులకు సంబంధించి కూడా ఈసారి బడ్జెట్లో ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతే కాకుండా దవాఖానల్లో మౌలిక సదుపాయాలు, నూతన భవనాలు, అత్యాధునిక వైద్య పరికరాలు తదితర అంశాలపై కూడా ఈ బడ్జెట్లో సర్కార్ నిర్లక్ష్య వ్యఖరి ప్రదర్శించినట్లు ప్రజలు మండిపడుతున్నారు.
నిమ్స్‌లో అత్యవసర వైద్యపరికరాల కోసం 16.50కోట్లు, నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ లేని నిరుపేద రోగులకు ఉచిత వైద్యసేవలు అందించడం కోసం బీపీఎల్ కింద రూ.7.90కోట్లు, క్యాపిటల్ నిధుల కింద మరో రూ.50కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఇక ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలో నూతన భవనాల నిర్మాణం కోసం రూ.4కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయించారు.
నిమ్స్, ఎంఎన్‌జె మినహా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, కోఠి ఈఎన్టీ, సుల్తాన్‌బజార్, పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖానలు, ఎర్రగడ్డ ఛాతీ దవాఖాన, మానసిక రోగుల దవాఖాన, నల్లకుంట కోరంటి తదితర టీచింగ్ హాస్పిటల్స్ అభివృద్ధి కోసం ఈ బడ్జెట్లో కేటాయింపులు పెద్దగా కనిపించలేదు.