మేడ్చల్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): కండ్లకోయ ఐటీ పార్క్ నిర్మాణ పనులలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. హైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా ఐటీ రంగాన్ని విస్తరించేలా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో 12 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది.
అందులో భాగంగా 2022 సంవత్సరంలో కండ్లకోయ ఐటీ పార్క్ ఏర్పాటుకు అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయడంతో పాటు నిధులను మంజూరు చేసి టెండర్లను ఆహ్వానించిన విషయం విదితమే. వాస్తవానికి 2026 సంవత్సరంలో ఐటీ పార్క్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా.. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఐటీ పార్క్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారయ్యాయి. ఈ క్రమంలో ఐటీ పార్క్ నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయో అన్నది ప్రశ్నర్థకరంగా మారింది.
అనుమతుల జారీలో నిర్లక్ష్యం..
ఐటీ పార్క్ నిర్మాణ పనులకు సంబంధించి వివిధ శాఖల నుంచి అనుమతి లభించినప్పటికీ హెచ్ఎండీఏ అనుమతి ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్న కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నట్లు విమర్శలున్నాయి. హెచ్ఎండీఏ ఉన్నతాధికారులపై ప్రజాప్రతినిధుల ఒత్తిడి తెచ్చి వెంటనే అనుమతులు ఇచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. కండ్లకోయ ఐటీ పార్క్ శంకుస్థాపన సమయంలోనే ఐటీ కంపెనీల ఏర్పాటుకు దాదాపు 100 వరకు కంపెనీలు రిజిస్టేష్రన్లు చేసుకున్నాయి.
ఐటీ పార్క్ నిర్మాణం పూర్తయితే సుమారు 200 వరకు ఐటీ కంపెనీల ఏర్పాటుకు అనువుగా ఉండేలా నమూనను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇది కార్యరూపం దాల్చి ఉంటే వేలాది సంఖ్యలో ఐటీ ఉద్యోగాల కల్పన జరగడంతో పాటు మేడ్చల్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉండేదన్నారు. దీనికి తోడు ఈ ప్రాంతంలో వ్యాపారాలు వృద్ధి చెంది అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించేదన్నారు. ఐటీ పార్క్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కైటీయ అధ్యక్షుడు ఒరుగంటి వెంకటేశ్వర్లు ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఐటీ పార్కు నిర్మాణం చేపట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు స్థానిక అభివృద్ధికి సహకిరించాలని కోరారు.