సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఖజానా నింపుకొనే క్రమంలో సామాన్యుడి గురించి కాంగ్రెస్ సర్కార్ ఆలోచన కూడా చేయలేదు. అసలే ఆర్థిక సంక్షోభంలో నెట్టుకొస్తున్న జనాలను ఎందుకు పన్నుల భారం మోపడం అనే సోయి లేకుండా కేవలం భూముల ధరలను మాత్రమే పెంచామని చెప్పుకొంటున్నది. కానీ ఈ భూముల విలువను సవరించడం వల్ల కలిగే దుష్ప్రరిణామాలపై సర్కార్ పెద్దలు ఏమాత్రం ఆలోచన చేయలేదు. అడ్డగోలు పెంపుతో రెండింతల భారాన్ని రియల్ ఎస్టేట్ రంగంపై మోపుతోంది.
ఒక్క భూమి విలువను సవరించడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు, భవన నిర్మాణ అనుమతులతోపాటు, అదనంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులపై కూడా భారం పడనున్నది. ఫలితంగా అటు సామాన్య వినియోగదారులు, ఇటు బిల్డర్ల జేబుల నుంచి అదనపు చెల్లింపులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూమి విలువ ఆధారంగానే బిల్డింగ్ పర్మిషన్ చార్జీలు, ఎల్ఆర్ఎస్ చార్జీలను విడివిడిగా వసూలు చేస్తున్నారు.
ఈ లెక్కన హెచ్ఎండీఏ లేదా మున్సిపల్ అనుమతులతో ఇండ్లను కట్టుకోవాలంటే గతంలో లక్ష రూపాయలు చెల్లించిన వారే.. అదే ప్రాంతంలో పెరిగిన ధరలతో రెండు లక్షలు చెల్లిస్తే గానీ భవన నిర్మాణ అనుమతులు పొందలేరు. ఒకవేళ ఎల్ఆర్ఎస్ స్కీం కింద దరఖాస్తు చేసుకున్న వారైతే అదనంగా మరో 14 శాతం చెల్లించి, ఆ తర్వాత భవన నిర్మాణ అనుమతుల కోసం మరోసారి 14 శాతం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఒక్క భూమి విలువను పెంచడం ద్వారా రియాల్టీ అనుబంధ రంగాలపై ప్రభావం చూపనున్నది.
హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయంలో సగానికి పైగా రియల్ ఎస్టేట్ రంగం నుంచే ఉంటుంది. కానీ గడిచిన రెండేళ్లలో ఈ రంగం నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరగడం లేదు. దీంతో రెవెన్యూ వసూళ్లలో రెండేళ్లు వెనుకబడిపోయింది. దీనికోసమే కోల్పోయిన ఆదాయంతో ఖజానా నింపుకొనేలా సర్కారు అడుగులు వేసి, భూముల ధరలను సవరించింది. క్యూర్ ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుని 50-100 శాతం విలువకు పెంచింది. దీంతో ఇక్కడే సర్కార్కు వచ్చే ఆదాయం డబుల్ కానుండగా, సామాన్యుడి జేబుకు మాత్రం చిల్లు మీద చిల్లు పడుతోంది.
ఒకే దెబ్బతో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేసిన సర్కార్.. పాలు ఇవ్వనీ గేదె నుంచి కూడా రక్తం పిండినట్లుగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం భూముల ధరలను సవరించడం ద్వారా ముందుగా భవన నిర్మాణ అనుమతులపై నేరుగా ప్రభావం పడుతున్నది. ఎలాగంటే మున్సిపల్, హెచ్ఎండీఏ వంటి సంస్థలు అనుమతులు ఇచ్చే క్రమంలో స్థానికంగా ఉండే ఎస్ఆర్వో ధరలను ప్రామాణికంగా తీసుకుని భవన నిర్మాణ ఛార్జీలను వసూలు చేస్తారు. ప్రస్తుతం పలు రకాల కంపోనెంట్లతో కలిపి దాదాపు 14 శాతం మేర ఉంది. అంటే గతంలో 10 లక్షల భూమి విలువ ఉండే స్థలంలో కట్టే నిర్మాణంపై 1.4లక్షలు వసూలు చేసేవారు.
కానీ ఇప్పుడు రూ. 10 లక్షల భూమి విలువ రూ. 20లక్షలకు చేరడంతో గతంలో చెల్లించిన దాని కంటే రెండింతలు ఫీజు రూపంలో సర్కార్ వసూలు చేయనున్నది. అలాగే ఎల్ఆర్ఎస్ విషయంలోనూ ఇదే సూత్రం వర్తించనుండగా, గతంలో ఇచ్చిన రాయితీల కంటే ఎక్కువ మొత్తంలో సామాన్యుడి ముక్కు పిండి వసూలు చేస్తున్నది. ప్రస్తుతం 14 శాతం తీసుకుని రెగ్యులరైజ్ చేస్తున్న సర్కార్.. దీన్ని కూడా మార్కెట్ విలువ ఆధారంగానే లెక్కగడుతుంది. దీంతో ఇప్పటివరకు చెల్లించిన మొత్తం కంటే ఎక్కువ సామాన్యుడి నుంచి సర్కార్ ఖజానాకు చేరనుంది. ఈ చార్జీల పెంపు వెనుక ఫ్రభుత్వానికి వస్తున్న ఆదాయం అత్యంత భారీగా ఉండనున్నది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్, పర్మిషన్ల ద్వారా వస్తున్న ఆదాయం ఈ నిర్ణయంతో ఏకంగా రెట్టింపు కానుంది. గతంలో పర్మిషన్లు, ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రభుత్వానికి రూ. 5వేల కోట్లు వస్తుంటే… ఇకపై అది సులభంగా రూ. 10వేల కోట్లకు చేరనుంది. సర్కారు ఖజానా కోసం సామాన్యుడి సొంతింటి కలను టార్గెట్ చేసినట్లుగా తాజా భూముల విలువ పెంపు ఉందనీ రియల్ ఎస్టేట్ వర్గాలు మండిపడుతున్నాయి.
ఎటొచ్చి కొనుగోలుదారుడికే భారం
ఈ అదనపు చార్జీల భారాన్ని బిల్డర్లు తమ జేబుల నుంచి పెట్టుకోరు. అంతిమంగా దీనిని కొనుగోలుదారుడిపైనే బదిలీ చేస్తారు. నిర్మాణ అనుమతుల చార్జీలు పెరగడం వల్ల చదరపు అడుగుకి నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. అటు ఎల్ఆర్ఎస్ ఛార్జీలు, ఇటు పర్మిషన్ చార్జీలు, మరోవైపు రిజిస్ట్రేషన్ ఫీజులు ఇలా అన్ని వైపులా బాదడంతో సొంత స్థలం కొని ఇల్లు కట్టుకుందామని మధ్యతరగతి వారి ఆశలు ఆడియాశలవుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ సామాన్యుడిపై భారాలు మోపే ధోరణి మారడం లేదనడానికి ఈ నిర్ణయం నిదర్శనం. రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సింది పోయి, కేవలం ఆదాయ వనరుగా మాత్రమే చూస్తూ చార్జీలను రెట్టింపు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఖజానా నింపే క్రమంలో జనాల జేబులకు చిల్లులు పెట్టే ఈ విధానంపై సర్కార్ పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది.