హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : సైబర్ మోసం కేసులపై గూగుల్ స్పందించింది. నకిలీ ఇన్వెస్ట్మెంట్ యాప్‌లకు సంబంధించి ఈ కేసులు నమోదవగా, 3 కేసుల్లో సహనిందితుడిగా గూగుల్ ఇండియా అధిపతి పేరునూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై అప్రమత్తమైన తాము వెంటనే సమగ్ర దర్యాప్తును ప్రారంభించామని బుధవారం గూగుల్ స్పష్టం చేసింది. కాగా, అధిక రాబడులను అందిస్తామని, గూగుల్ ప్లే స్టోర్ ద్వారా తమ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ కేటుగాళ్లు చేసిన ప్రకటన మాయలోపడ్డారు కొందరు అమాయకులు. ఆ తర్వాత సదరు మోసపూరిత ట్రేడింగ్ అప్లికేషన్ (యాప్)లను ప్లే స్టోర్‌లో చూసి, డౌన్లోడ్ చేసి పెట్టుబడి పెట్టి నిండా మునిగారు. ఈ ఫిర్యాదులతోనే సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించడంతో అవి నమ్మకమైన యాప్‌లేనని భావించామని, తీరా డౌన్లోడ్ చేసి మోసపోయామని బాధితులు లబోదిబోమంటున్నారు. దీనిపై మూడు వేర్వేరు ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో మోసగాళ్లతోపాటు గూగుల్ ఇండియా చీఫ్‌ను కూడా చేర్చడం ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నది. కాగా, పీటీఐ పంపిన ఈ-మెయిల్‌కు గూగుల్ అధికార ప్రతినిధి సమాధానమిస్తూ.. విషయం తెలిసిన వెంటనే దర్యాప్తు చేపట్టామని, ప్లేస్టోర్‌లో ఒకేఒక్క ఇన్వెస్ట్మెంట్ యాప్ ఉన్నట్టు గుర్తించామని, అది కూడా తమ ఆర్థిక సేవల పాలసీకి లోబడే ఉన్నదని వివరించారు. ఇక గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్ అందుబాటులో ఉండటంతో నమ్మి రూ.24.37 లక్షలు పోగొట్టుకున్నట్టు ఒక బాధితుడు ఫిర్యాదు చేశారు. జూలై 14న మరో 40 ఏండ్ల వ్యక్తి నకిలీ సెక్యూరిటీస్ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.17 లక్షలు పోగొట్టుకున్నట్టు ఫిర్యాదు చేయగా, జూన్ 30న 71 ఏండ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రూ.7.42 లక్షలు మోసపోయినట్టు మరో కేసు నమోదైంది.