Drinking Water | ఖైరతాబాద్, మే 22 : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమిది. కాంగ్రెస్ పాలనలో వివిధ ప్రభుత్వ శాఖలు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులను ఖాతరు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలే అధికార యంత్రాంగం పనితీరును ప్రశ్నిస్తుండడంతో మరో సారి ప్రభుత్వ వైఫల్యం వెలుగుచూసింది.
సోమాజిగూడ డివిజన్లోని ఎంఎస్ మక్తాలో కొంత కాలంగా నల్లా నీటిలో మురుగునీరు వస్తుండడంతో పాటు అనేక చోట్ల లోప్రెషర్ సమస్య వేధిస్తున్నది. సుమారు 4వేలకు పైగా కుటుంబాలు ఉన్న ఎంఎస్‌మక్తాలో ఏడాదిన్నర కాలంగా పరిష్కారం కాని సమస్యగా మారింది. స్థానిక ప్రజలతో పాటు స్వయంగా కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్‌యాదవ్, ఆమె భర్త, కాంగ్రెస్ నేత వనం శ్రీనివాస్ యాదవ్‌లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులుగా అనేక సార్లు జలమండలి దృష్టికి తీసుకువచ్చారు.
అయినా పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక నిరసనకు దిగారు. గురువారం తమ కార్యకర్తలకు రేవంత్‌రెడ్డి ఫొటోతో ఉన్న టీషర్టులు ధరింప చేసి బహిరంగంగానే నిరసన కార్యక్రమం చేపట్టారు. జలమండలిలోని ఎండీ చాంబర్ ముందు బైఠాయించి తమ సమస్య పరిష్కరించాలంటూ ధర్నా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ..
సర్కారు ఏదైనా ప్రభుత్వ శాఖలు వాటి పరిధిలోనే పనిచేస్తాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ శాఖలపై నియంత్రణ కొరవడినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల మాటలకు విలువలేకుండా పోయిందనడానికి ఇది ఒక ఉదాహరణ అని అంటున్నారు. గతంలో చింతలబస్తీలో రోప్ కార్యక్రమంలో భాగంగా పోలీసులు, జీహెచ్ఎంసీతో కలిసి ఆక్రమణలను కూల్చివేస్తుంటే దానిని అడ్డుకోబోయిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఘోర పరాభావం తప్పలేదు.
అతని మాటలను ఉన్నతాధికారులు ఖాతరు చేయకుండా కూల్చివేయడం గమనార్హం. గతేడాది సోమాజిగూడలో డ్రైనేజీ సమస్యను అధికారులు పట్టించుకోకపోవడంతో స్వయంగా డివిజన్ కార్పొరేటర్ వనం సంగీత యాదవ్ భర్త శ్రీనివాస్ యాదవ్ డ్రైనేజీ గుంతలో దిగి తన నిరసనను బహిరంగంగానే వ్యక్తపరిచారు. ఆ ఘటన నాడు అధికార పార్టీ పనితీరును ప్రశ్నించింది. తాజాగా ప్రభుత్వంలో భాగమైన జలమండలి నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఏకంగా ఆ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ చాంబర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీని బట్టి సొంత పార్టీ ప్రజాప్రతినిధులు బహిరంగంగానే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపిస్తుండడం విశేషం. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.