సిటీ బ్యూరో/జూబ్లీహిల్స్, జూన్ 18 : ‘ఏరా.. ఎంత అహంకారం నీకు..నేను పిలిస్తే రావా..చంపేస్తా నిన్ను’ అంటూ రహ్మత్ నగర్ కాంగ్రెస్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి రెచ్చిపోయి యూసుఫ్‌గూడ -19 సర్కిల్ కార్యాలయంలో తన అనుచరులతో కలిసి వచ్చి వీరంగం సృష్టించారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బాలరాజును పరుష పదజాలంతో దూషించి దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో నేడు జీహెచ్ఎంసీ 19వ సర్కిల్ కార్యాలయంలో అధికారులు పెన్‌డౌన్ సమ్మెకు పిలుపునిచ్చారు.
పోలీసులు, ఏఎంసీ బాలరాజు,ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బీఆర్ఎస్ నుంచే కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన రహ్మత్‌నగర్ కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి బుధవారం ఉదయం అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బాలరాజ్‌కు ఫోన్‌చేసి రహ్మత్‌నగర్‌కు వెంటనే రావాలన్నారు. కార్యాలయంలో తనకు ముఖ్యమైన స మావేశం ఉందని..ముగిశాక వస్తానని అధికారి బదులిచ్చారు.
దాంతో కోపోద్రిక్తుడైన కాంగ్రెస్ కార్పొరేటర్.. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్‌ను ఫోన్లోనే దూషించి..కోపం చల్లారక యూసుఫ్‌గూడ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయానికి తన స్థానిక రౌడీ అనుచరులతో కలిసి వచ్చి నానా రగడ చేశారు. నేరుగా అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బాలరాజ్ కుర్చీ వద్దకు వెళ్లి ఇష్టానుసారంగా బూతులతో విరుచుకుపడ్డారు.
సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ జకియా సుల్తానా, సహోద్యోగులు, సిబ్బంది ఎదుటే అధికారి బాలరాజ్ ను దూషించి పైపైకి వచ్చి బెదిరింపులకు గురి చేశారు. ఎంతగా నచ్చజెప్పినా వినకుండా కార్పొరేటర్ సిఎన్ రెడ్డి నానా హంగామా చేశారు. ఈ వివాదం మొత్తం సామాజి మాద్యమాల్లో వైరల్ గా మారింది. అధికార పార్టీ కార్పొరేటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేద్దామా..వద్దా అని తర్జనభర్జన పడి బుధవారం రాత్రి తన సిబ్బంది ద్వారా మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.