సిటీబ్యూరో, నవంబర్7(నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్‌లో త్వరలో ఉప ఎన్నిక జరగనున్నది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రోడ్‌షోలు, సభలు నిర్వహిస్తున్నారు. రౌడీషీటర్ల కదలికలు, ఇతర అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలంయాదవ్ రౌడీషీటర్ కావడంతో పాటు ఆయన తమ్ముడు రౌడీషీటర్ కాగా.. నవీన్‌యాదవ్ ప్రజలను, ఇతర పార్టీ కార్యకర్తలను బెదిరిస్తూ మాట్లాడుతున్న తీరుతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఇటీవల కొండాసురేఖ ఓఎస్డీ సుమంత్ తొలగింపు ఎపిసోడ్లో అతడు వాడిన గన్ ఎక్కడిదని, దానికి లైసెన్స్ ఉందా అనే చర్చ జరిగింది. కాగా జూబ్లీహిల్స్‌లో ఎన్ని గన్లు ఉన్నాయి.. లైసెన్స్‌లు ఉన్నవి ఎన్ని, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నవారెంతమంది అనే కోణంలో స్థానికులు మాట్లాడుకుంటున్నారు. ఒక పార్టీ అభ్యర్థికి సంబంధించిన ఇద్దరు ముగ్గురు అతడితో పాటు ప్రచార యాత్రలో పాల్గొనే క్రమంలో పిస్టల్ కలిగి ఉన్నారని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. రౌడీషీటర్లే తమ పార్టీ తరపున ప్రచారం చేస్తుండడంతో పాటు వారితో తమకెందుకు పంచాయతీ అంటూ నోరెత్తడం లేదు.
గన్ లైసెన్సులు ఉన్నవారిలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోనే ఎక్కువగా గన్లు ఉన్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోని 99 పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న 3,709 మంది తమ వద్ద ఉన్న ఆయుధాలకు లైసెన్స్ పొందగా, వారిలో 906 మంది అంటే సుమారు 25 శాతం మంది బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లైసెన్స్ పొందిన ఆయుధాల్లో అధికంగా పిస్టల్స్, రివాల్వర్లే ఉన్నాయని తెలిసింది. ఒక్క బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోనే 567 లైసెన్స్ హోల్డర్లు ఉండగా వారి వద్ద 844 ఆయుధాలున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో 234 లైసెన్స్‌లు ఉండగా వారిలో 212 మంది ఆయుధాలను డిపాజిట్ చేశారు. పదిమంది ఆయుధాలను డిపాజిట్ చేయలేని పరిస్థితి ఉందని, వారు సెక్యూరిటీలో ఉన్నవారు కావడంతో వారికి మినహాయింపు ఇచ్చామని తెలిపారు.
జూబ్లీహిల్స్‌లో పోలీసు స్టేషన్ల పరిధిలో సుమారుగా 800 అక్రమ ఆయుధాలు అనధికారికంగా ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. వీటిలో ఎక్కువగా పిస్టల్స్, రివాల్వర్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఎన్నికల సమయంలో అధికారికంగా లైసెన్సులు ఉన్నవారే తమ ఆయుధాలను డిపాజిట్ చేస్తుండగా.. అనధికారికంగా ఆయుధాలు కలిగిన వారు సమయాన్ని బట్టి తమ వాడకాన్ని చూపిస్తున్నారు. కొండా ఓఎస్డీ సుమంత్ ఎపిసోడ్ కూడా జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోనే జరగడంతో అసలు ఆయన దగ్గర గన్ ఎక్కడిది.. ఆ గన్‌కు లైసెన్స్ ఉందా.. మంత్రి ఓఎస్డీ దగ్గర ఉన్న గన్ విషయంలో పెద్ద ఎత్తున దుమారం రేగినప్పటికీ ఇప్పటివరకు ఆ విషయంలో పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదనే చర్చ జరుగుతోంది.
జూబ్లీహిల్స్ పరిధిలో రౌడీషీటర్లు, అనుమానితులు కలిపి 150మంది మాత్రమే కాకుండా మరికొందరు నేరచరిత్ర కలిగిన వ్యక్తులున్నారని వారిలో ఎంత మంది దగ్గర గన్స్ ఉన్నాయో.. అందులో అనధికారికంగా ఉన్న గన్ల వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పవంటూ స్థానికంగా మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌కు సిటీలో చాలామంది రౌడీషీటర్లతో సంబంధాలు ఉండడంతో పాటు వారంతా ఈ ఎన్నికలో అంతర్గతంగా పనిచేస్తారని, అక్రమ ఆయుధాల వాడకంలో వారి ప్రమేయం ఉండే అవకాశం ఉంటుందని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.