మేడ్చల్ కలెక్టరేట్/ మేడ్చల్, సెప్టెంబర్ 2 : మాయ మాటలు చెప్పే బీజేపీ, కాంగ్రెస్ నేతలను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ 9వ వార్డులోని భవానీనగర్ కాలనీకి చెందిన 200మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు శనివారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయంలోనే పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ప్రజలను పట్టించుకున్న పాపన పోలేదని, ఇంత వరకు ఒక్క అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. 9వ వార్డు కౌన్సిలర్ సైతం ఇంత వరకు ఎంపీ నిధులనుంచి ఒక్క పైస కూడా తీసుకురాలేదని అన్నారు.
58 జీఓ కింద ఇంటి పట్టాలు అందజేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అధిక అసెంబ్లీ స్థానాలు గెలిచి 3వ సారి బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపడుతుందని చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీలు ఖాళీ అవుతున్నాయని, పని చేసే వారికి ఓటు వేయాలని, నాకన్నా ఎక్కువ పని ఎవరైనా చేస్తే.. వారికే ఓటు వేయాలని సూచించారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ 9వ వార్డు భవానీ నగర్లో రేషన్ షాపు, బస్తీ దవాఖానను త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దయాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిగౌడ్, కౌన్సిలర్లు, కో-అప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఎల్లంపేట ఎస్సీ కాలనీలో చేరికలు

భారతీయ రాష్ట్ర సమితిలో చేరికల పరంపర కొనసాగుతున్నది. శనివారం మేడ్చల్ మండలం ఎల్లంపేట ఎస్సీ కాలనీకి చెందిన 50మంది బీఆర్ఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి తుడుం రాజు ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలోని మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. మంత్రి మల్లారెడ్డి గులాబీ కండువాతో వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పరిపాలన తీరు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై స్వచ్ఛందంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు కుమార్ యాదవ్, ఉప సర్పంచ్ గోప గణేశ్, వార్డు సభ్యులు రమేశ్ యాదవ్, రామకృష్ణ రాజు, రామకృష్ణుడు, రాజు, వెంకన్న, సుధాకర్, రాజిరెడ్డి, గోప యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.