కంటోన్మెంట్: కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా బీజేపీ అనుకూలరను నామినేటెడ్ పోస్టులో కూర్చోబెట్టి.. విలీన ప్రక్రియ పేరుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కంటోన్మెంట్ ప్రజలతో డబుల్ గేమ్ ఆడుతున్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డు సివిలీయన్ నామినేటెడ్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ. రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం గెజిట్ విడుదల చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డు పాలకమండలికి ఎన్నికలు నిర్వహించకుండా జీహెచ్ఎంసీలో విలీనం పేరిట నామినేటేడ్ సభ్యులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని మండిపడ్డారు.
ఆదివారం క్రిషాంక్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. నామినేటెడ్ పదవి కుర్చీపై పెట్రోల్ పోసి తగులబెట్టి, గెజిట్ ప్రతులను చింపేశారు. కంటోన్మెంట్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని మండిపడ్డారు. 2015 తర్వాత కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరగలేదని గుర్తు చేశారు. ఆ తర్వాత దేశంలోని కంటోన్మెంట్ బోర్డులను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తున్నామని ప్రజలను నమ్మించి ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రాంత బీజేపీ నేతలు ఢిల్లీకి పరుగులు తీస్తూ స్థానిక ఎంపీ ద్వారా పైరవీలు చేసి నామినేటెడ్ పదవి తెచ్చుకుంటున్నారని ఆరోపించారు.
కనీసం ఎజెండాపై అవగాహన లేకుండా, చట్టాలు తెలియకపోయినా కుర్చీలో కూర్చుని ఇష్టానుసారంగా ఒక్కరే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. కంటోన్మెంట్ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ఓట్లు వేసి ప్రతినిధులను ఎన్నుకోవాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. తామే ప్రత్యక్షంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు ఎన్నికలను కోరుకుంటున్నారని అన్నారు. తాగునీటి సమస్య, ఇండ్ల అనుమతులు, రోడ్ల మరమ్మతులు తదితర సమస్యలతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రజలు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఎక్సేంజ్ ఆఫ్ ల్యాండ్ సమస్య కూడా నెరవేరకుండా ఇబ్బందులు తలెత్తుతున్నాయని క్రిషాంక్ ధ్వజమెత్తారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆనంద్, మౌని గంగరాం, రఘు తదితరులు పాల్గొన్నారు.