సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): విద్యుత్ శాఖలో బదిలీలపై సందిగ్ధత నెలకొంది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియకు సోమవారంతో గడువు ముగిసిన వెంటనే జాబితా ప్రకటించాల్సిన డిస్కం ఉన్నతాధికారులు మంగళవారం సాయంత్రం వరకూ దాన్ని ప్రకటించలేదు. దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ప్రత్యేకంగా బదిలీల్లో పారదర్శకత కోసం సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి, ప్రత్యేకంగా మార్గదర్శకాలను రూపొందించారు.
బదిలీలకు అర్హులైన ఉద్యోగుల జాబితాను హోదాల వారీగా విడుదల చేసి, వెబ్ కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్ ఎక్కడ కావాలో ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. ఈ బదిలీ ప్రక్రియ సాఫీగా, వేగంగా ముగుస్తుందని భావించారు. సాఫ్ట్‌వేర్‌లో వెబ్ కౌన్సెలింగ్ గడువు 7వ తేదీ అర్ధరాత్రి వరకు ముగిసినా, మరుసటి రోజైన మంగళవారం బదిలీలకు సంబంధిత జాబితాను వెంటనే ప్రకటించాల్సి ఉంది. దీనికి కారణం పెద్దల నుంచి ఒత్తిళ్లేనని తెలుస్తున్నది.
సుమారు 850 మందిని బదిలీ చేయాలని నిర్ణయించగా, అందులో 25 నుంచి 30 పోస్టులకు పైరవీలు ఎక్కువగా జరిగాయని విద్యుత్ శాఖలో చర్చ జరిగింది. దక్షిణ డిస్కం పరిధి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 10 సర్కిళ్లలోనే పోస్టింగ్‌ల కోసం ఉద్యోగులు ఎక్కువ ఆసక్తిని కనబర్చారు. వెబ్ కౌన్సెలింగ్ విధానం ఉన్నా.. సచివాలయం నుంచి ఆదేశాలు తెచ్చుకునేందుకు కొంత మంది ప్రయత్నిస్తూనే ఉండటంతోనే ఉద్యోగుల బదిలీల జాబితాను ప్రకటించలేకపోతున్నారని సమాచారం.
మరోవైపు డిస్కంలోని హెచ్ఆర్ విభాగం అధికారులు మింట్ కాంపౌండ్‌లోని ప్రధాన కార్యాలయంలో కాకుండా ఎర్రగడ్డ-జీటీఎస్ కాలనీలో ఉన్న విద్యుత్ శాఖకు చెందిన కార్యాలయంలో బదిలీల తుది జాబితాపై కసరత్తు చేసినట్టు సమాచారం. మొత్తంగా విద్యుత్ శాఖలో బదిలీల ప్రక్రియ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పలేమని ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.