సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రవేశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీల్లో అడ్మిషన్లు 40 శాతం కూడా పూర్తికాలేదు. గడిచిన మూడేండ్లుగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి లేకపోవడంతో ప్రవేశాల ప్రక్రియ ఇన్చార్జి అధికారి చేతిలో కీలు బొమ్మలా మారిపోయిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన హెచ్‌సీయూలో అడ్మిషన్ల ప్రక్రియ గందరగోళంగా మారడంతో యూనివర్సిటీ భవితవ్యంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది ఒకేసారి కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేసి అన్ని సీట్లను భర్తీ చేసేవారని విద్యార్థులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఇన్చార్జి ఎగ్జామినేషన్ కంట్రోలర్ దశల వారీగా ఖాళీలను భర్తీ చేసే సంప్రదాయానికి తెర తీశారని అంటున్నారు. దీంతో మొదట అన్ని విభాగాల్లో కొన్ని సీట్లను నింపి మిగతా వాటి కోసం వెయిటింగ్ లిస్టును సిద్ధం చేశారని అంటున్నారు. దీంతో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా తమకు సీటు వస్తుందో రాదోననే అనుమానంతో ఇతర యూనివర్సిటీల్లో చేరుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో నైపుణ్యం, ప్రతిభ కలిగిన విద్యార్థులకు హెచ్‌సీయూలో సీటు లభించడం లేదని ఆరోపిస్తున్నారు. చివరకు ఇది యూనివర్సిటీ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని ఆందోళన చెందుతున్నారు. ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఇష్టారీతి నిర్ణయాల వల్ల యూనివర్సిటీ తీవ్రంగా నష్టపోతుందని మండిపడుతున్నారు. అనుభవం కలిగిన శాశ్వత ఎగ్జామినేషన్ కంట్రోలర్ లేకపోవడంతోనే ప్రవేశాల్లో గందరగోళం నెలకొంటుందని అంటున్నారు. ప్రస్తుత ఇన్చార్జి తుకారం ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రతిభ కలిగిన విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
యూనివర్సిటీకి శాశ్వత ప్రాతిపదికన ఎగ్జామినేషన్ కంట్రోలర్‌ను భర్తీ చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నా వీసీ, రిజిస్ట్రార్ అడ్డుకుంటున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంలో ఇన్చార్జి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారికి వారు అండగా ఉంటూ యూనివర్సిటీ భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతున్నారని మండిపడుతున్నారు. వీసీ, రిజిస్ట్రార్ అండతో ఇన్చార్జి సీవోఈ తనకు నచ్చినట్లు వ్యవహరిస్తూ సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఏ సెంట్రల్ యూనివర్సిటీలోనైనా మూడేండ్లుగా ఎగ్జామినేషన్ కంట్రోల్ స్థానం ఖాళీగా ఉండదని చెబుతున్నారు. జేఎన్‌యూ, డీయూ వంటి వాటిలో ఈ తరహా నిర్లక్ష్యం ఉండదని… ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ యూనివర్సిటీ ప్రతిష్ఠను దెబ్బ తీస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకడమిక్ ఇయర్ సమీపించినా ఇప్పటిదాకా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో విద్యార్థులు కలవరం చెందుతున్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులు ఇతర యూనివర్సిటీలో చేరుతున్నారని మండిపడుతున్నారు. వెయిటింగ్ లిస్ట్ పేరుతో విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతున్నదని అంటున్నారు.
గతేడాది వరకు అడ్మిషన్ల ప్రక్రియను ఒకేరోజు పూర్తి చేసేవారు. కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లన్నీ భర్తీ చేసేవారు. విద్యార్థులెవరైనా ఏ కారణాలతోనో జాయిన్ కాకుంటే ఆ స్థానాలకు మాత్రమే వెయిటింగ్ లిస్ట్ తయారు చేసేవారు. దీంతో తొలి విడతలోనే 90 శాతానికిపైగా సీట్లు నిండిపోయేవి. కానీ ప్రస్తుతం జూలై నెల పూర్తవుతున్నా ఇప్పటికీ 40 శాతం సీట్లే నిండాయని విద్యార్థులు చెబుతున్నారు. అప్పుడే వెయిటింగ్ లిస్ట్ పెట్టడంతో మంచి మార్కులొచ్చిన ప్రతిభ కలిగిన విద్యార్థులు ఇతర యూనివర్సిటీలో చేరుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియలో మార్పులు ఎందుకు తీసుకొచ్చారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక ఏదైనా గూడుపుటాని జరుగుతున్నదా? అనే అనుమానాలు లేవనెత్తుతున్నారు. ఇన్చార్జి సీవోఈ తీరుపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఈనెల 30, 31న వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తారని ఇన్చార్జి సీవోఈ ప్రకటించారు. ఆ రెండు రోజుల్లోనే అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేస్తే బాగుంటుందని విద్యార్థులు సూచిస్తున్నారు. శాశ్వత కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారిని నియమిస్తే ఇలాంటి గందరగోళానికి స్వస్తి చెప్పొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.