ఇష్టారాజ్యంగా, అనాలోచితంగా, అమలుకు సాధ్యం కాని 420 హామీలను ప్రజలపై గుప్పించి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సగటు మనిషిని, రైతులను తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నించింది. కాగా, సామాజిక ఉద్యమకారుడు గవినోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలో హై కోర్టు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా యంత్రాంగం చెంప చెళ్లుమనిపించింది. ఇష్టవచ్చినట్టు వ్యవహరిస్తే తగదని, అర్హులందరికీ న్యాయం జరగాలని, పథకాలు అందరికీ వర్తించాలని ఆదేశించింది.
సిటీబ్యూరో/రంగారెడ్డి, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ‘420’ హామీలను మేనిఫెస్టోలో అంగరంగ వైభవంగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ఎగవేసేందుకు నానా అవస్థలు పడుతుంది. అటు ప్రజలు, ఇటు కోర్టులు సర్కారును చెడుగుడాడుతున్నాయి. హామీ అమలు ఇష్టానుసారంగా చేయడం కుదరదని హై కోర్టు మొట్టికాయలు వేసింది. అర్హులందరికీ న్యాయం జరిగేలా పథకాలు ఉండాలని సూచించింది. తాజాగా ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అట్టహాసంగా అమలు చేస్తామని ప్రగల్బాలు పలికి, పట్టణ ప్రాంత కూలీలను మాత్రం పక్కన పెట్టేసే కుట్రలు చేసింది. గ్రామీణ ప్రాంత కూలీలకే ఏడాదికి రూ.12 వేల సాయం అంటూ ఊదరగొట్టింది. ఈ సాయం కూడా అందరికీ చేరలేదు.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణ ప్రాంత కూలీలకు చేస్తున్న కుట్రను సామాజిక ఉద్యమకారుడు గవినోళ్ల శ్రీనివాస్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన హై కోర్టు, మున్సిపాలిటీలోని కూలీలను కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో చేర్చాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఒంటెత్తు పోకడ పోతుందని పట్టణ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పుతో రాష్ట్రంలో 129 మున్సిపాలిటీల్లో సుమారు 8 లక్షల మందికి న్యాయం జరగనుందని పిటిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శివారు గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసి, వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎగ్గొట్టాలని భావించింది. గ్రామాలను పట్టణాల్లో కలిపి అభివృద్ధి జరుగుతుందంటూ వారిని తప్పుదోవ పట్టించేలా సర్కార్ ధ్వంసరచన చేసింది. కానీ, కాంగ్రెస్ సర్కార్ కుయుక్తులను ప్రజలు తిప్పికొట్టారు. వారి గళం వినిపిస్తూ శ్రీనివాస్ ద్వారా కోర్టుకు వెళ్లారు. హై కోర్టు తీర్పు సానుకూలంగా రావడంతో పట్టణ ప్రాంత కూలీలకు ఆత్మయ భరోసా అమలు చేయక సర్కారుకు తప్పని పరిస్థితి ఏర్పడింది.
ప్రతిష్టాత్మకం.. కాస్త ప్రహసనంగా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమని చెబుకుంటున్న పథకాల పంపిణీ ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో ప్రహసనంగా మారింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని ప్రారంభించిన రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు వంటి పథకాలు ప్రచారానికి తప్పా, ప్రజల దరికి చేరలేదు. జిల్లా వ్యాప్తంగా 21 గ్రామాలను ఫైలెట్ ప్రాజెక్టు కింద తీసుకుని పథకాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పథకాలు వస్తాయని భావించిన ప్రజలకు నిరాశే మిగిలింది. జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లల్లో అసలు పట్టించుకోకపోగా, 21 మండలాల్లో మండలానికో గ్రామం చొప్పున 21 గ్రామాలను ముందుగా ఎంపిక చేసుకున్నారు.
ఈ గ్రామాల్లో జనవరి 26 నుంచి అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు అందజేసే కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. కానీ, ఇప్పటివరకు గత ప్రభుత్వ హయాంలో ఉన్న రైతు బంధు పథకంలోని రైతులకు మాత్రమే పేరు మార్చి రైతు భరోసాగా నామకరణం చేసి పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు కింద ఇచ్చిన సగం మందికి కూడా రైతు భరోసా అందటం లేదు. రైతు భరోసా కింద ఎంపిక చేసిన వారికి కూడా ఇప్పటివరకు పెట్టుబడి సహాయం అందలేదు.
అంతంత మాత్రం.. ఆత్మీయ భరోసా!
ఆత్మీయ భరోసా పథకం జిల్లాలో అంతంత మాత్రంగానే సాగుతోంది. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉండి, 20 రోజులు పనిచేసిన భూమిలేని రైతు కూలీలకు రూ.12 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని, ప్రకటించిన ప్రభుత్వం ఆత్మీయ భరోసా కింద ఈ పథకాన్ని ప్రారంభించింది. కానీ, ఆత్మీయ భరోసాలో ఏ ఒక్కరికి కూడా నగదు సహాయం అందలేదు. అలాగే, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఏ ఒక్కరికి అందిన దాఖలాలు లేవు.
ఇతర గ్రామాల పరిస్థితి ప్రశ్నార్థకం?!
జిల్లాలోని 21 పైలెట్ గ్రామాల్లో ప్రభుత్వ పథకాల పంపిణీ అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో మిగిలిన గ్రామాల్లో తమకు వస్తాయా? రావా? అని ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఈ యాసంగిలో వ్యవసాయానికి పెట్టుబడి సహాయం అందుతుందని ప్రజలు భావించారు. సంక్రాంతి తర్వాత రైతులందరికి పెట్టుబడి సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, వరి నాట్లు పూర్తి కావొస్తున్నప్పటికీ పెట్టుబడి సహాయం కింద రైతు బంధు సహాయం అందటం లేదు. అలాగే, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల ఊసే ఎత్తుటం లేదు. ఈ పరిస్థితిలో ఎవరికి చెప్పాలో తెలియని అయోమయంలో ఆయా గ్రామాల ప్రజలు ఉన్నారు.
కూలీలందరికి ఆత్మీయ భరోసా ఇవ్వాల్సిందే..
గ్రామాల్లోని రైతు కూలీలకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కల్పిస్తామని ప్రభుత్వం నిర్ణయించడం హాస్యాస్పదం. మున్సిపాలిటీలో ఉన్న రైతు కూలీలకు ఎందుకు పథకం వర్తింపజేయరు? ఈ విషయంపై నేను న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌తో కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాను. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. కూలీలందరిని ఆత్మీయ భరోసాలోకి తీసుకురావాలని సీఎస్‌కు ఆదేశించింది. నాలుగు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది. కూలీలకు అన్యాయం చేయాలని ప్రభుత్వమే భావించడం బాధాకరం. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పథక రూపకల్పన ఉండాలి. ప్రకటించే ముందరనే నిపుణులతో కసరత్తు చేయాలి. ఇలా స్పష్టత లేకుండా లక్షలాది మంది కూలీలకు అన్యాయం జరిగేలా నిర్ణయాలు ఉండకూడదు.
– గవినోళ్ల శ్రీనివాస్, పిటిషనర్, సామాజిక కార్యకర్త
పైలెట్ గ్రామాలకే భరోసా.. సిగ్గుచేటు..!
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం అందరికి అందజేస్తామని ప్రకటించి, కేవలం మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి, పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలకే రైతు భరోసా అందజేయటం సరైన పద్ధతి కాదు. మిగతా గ్రామాల్లో రైతులకు రైతు భరోసా పథకం వర్తింపజేయకుండా, కేవలం పైలెట్ గ్రామాలకే భరోసా అందించటం సిగ్గుచేటు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులందరికీ కాంగ్రెస్ సర్కారు భరోసా వర్తింపజేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో రైతు బంధు పథకం కింద పెట్టుబడి సహాయం అందజేసి ఆదుకునేది. కాంగ్రెస్ సర్కారు రైతులను నమ్మించి నట్టేటా ముంచుతుంది.
– ఏనుగు బుచ్చిరెడ్డి, తుర్కగూడ, రైతు, ఇబ్రహీంపట్నం రూరల్
అర్హులైన రైతులందరికీ రైతు భరోసా వర్తించాలి
గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం కింద అందజేసిన పెట్టుబడి సహాయం ఇప్పుడు కూడా అర్హులైన రైతులందరికీ అందజేయాలి. ఎన్నికల ముందు ఎకరాకు ప్రతి ఏటా రూ.15 వేలు అందజేస్తామని చెప్పి అందజేయకపోవటం సిగ్గుచేటు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా.. నేటికీ ఒక్క పంటకు కూడా పెట్టుబడి సహాయం అందిచకపోగా, అందరికీ అందజేయాల్సింది పోయి పెట్టుబడి సహాయంలో కోత విధించటం సిగ్గుచేటు. ప్రతి ఒక్కరికి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించాలి.
– నిట్టు వీరయ్య, కప్పాడు, రైతు, ఇబ్రహీంపట్నం రూరల్