Metro Train | సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో మెట్రో రైలు మార్గం అందరికీ ప్రయోజనం. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మౌలిక వసతుల ప్రాజెక్టుల రూపకల్పన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అయితే రేవంత్‌రెడ్డి సర్కార్ గత ప్రభుత్వం చేపట్టిన బహుళ ప్రయోజనాలు కలిగిన భారీ ప్రాజెక్టులను రద్దు చేసి..కొత్తగా చేస్తున్న ప్రతిపాదనలు గందరగోళంగా, ఆగమ్య గోచరంగా ఉంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజాగా శనివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన ఫోర్త్‌సిటీ మెట్రో మార్గంపై అప్పుడే విపరీతమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాస్త్రీయంగా ట్రాఫిక్‌ను అధ్యయనం చేసి అత్యంత యోగ్యమైన మెట్రో రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో మార్గాన్ని గుర్తించారు. ఈ మార్గాన్ని నిర్మించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం డీపీఆర్ రూపకల్పనతో పాటు క్షేత్ర స్థాయిలో పనులు పూర్తి చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేసింది. దాని స్థానంలో నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు, మరో మార్గాన్ని మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్ మీదుగా కొత్త హైకోర్టు వరకు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్త్న్నుది.
గత కేసీఆర్ ప్రభుత్వం ఫార్మాసిటీకి ఉన్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌పోర్టు వరకు వచ్చిన మెట్రో మార్గాన్ని పొడిగిస్తూ..హైదరాబాద్-శ్రీశైలం హైవేపై తుక్కుగూడ మీదుగా మహేశ్వరం, కందుకూరు వరకు మెట్రో మార్గాన్ని మూడో దశలో నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల మీదుగా గత కేసీఆర్ ప్రభుత్వం మెట్రో ప్రతిపాదనలు చేస్తే, వాటిని పూర్తిగా పక్కన పెట్టి..కొత్త మెట్రో మార్గాలను అష్ట వంకర్లు తిప్పుతూ.. ఫోర్త్ సిటీ వరకు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తాజాగా ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
కొత్తగా నిర్మిస్తున్న హైకోర్టు నుంచి ఎయిర్‌పోర్టు లోపలి నుంచి తుక్కుగూడ, కొంగరకలాన్ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ మీదుగా ఫోర్త్ సిటీగా చెబుతున్న ప్రాంతానికి ప్రతిపాదిస్తున్న మెట్రో మార్గంలో.. రద్దీ లేని ప్రాంతాలే ఉన్నాయి. ముఖ్యంగా కొంగరకలాన్ నుంచి 18 కి.మీ మేర ఫోర్త్ సిటీ వరకు ప్రతిపాదిస్తున్న మార్గంలో రోడ్డు మార్గమే లేని చోట కొత్తగా రోడ్డును, ైఫై ఓవర్‌ను నిర్మిస్తున్నా.. దానిపై మెట్రో మార్గాన్ని నిర్మిస్తామని ప్రకటించడం పట్ల రవాణా రంగ నిపుణులు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.