SPDCL | సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): క్షేత్ర స్థాయిలో విద్యుత్ నెట్‌వర్క్‌ను పర్యవేక్షించేందుకు రూపొందించిన 11 కేవీ ఫీడర్ సర్వేతో మంచి ఫలితాలు సాధించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కార్యాచరణ రూపొందించింది. నిరంతరం నాణ్యమైన సరఫరాలో అత్యంత కీలకమైంది క్షేత్ర స్థాయి నెట్వర్క్. అందులో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత యంత్రాంగానిదే.
ఈ విషయాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు.. సుమారు రెండు నెలల పాటు క్షేత్ర స్థాయిలోని ప్రతి ఫీడర్లో లైన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి..‘టీజీఎయిమ్స్’ పేరుతో యాప్‌ను రూపొందించి..అందుబాటులోకి తెచ్చారు. విద్యుత్ ఉద్యోగులు మాత్రమే వినియోగించేలా రూపొందించిన ఈ యాప్‌లో సరఫరాకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. ఏ ఫీడర్ పరిధిలో సరఫరాకు అంతరాయం కలిగిందో కచ్చితంగా తెలుసుకొని.. అక్కడి సెక్షన్ ఎలక్ట్రిక్ అధికారులు..ఫ్యూజ్ ఆఫ్ కాల్ సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేసేలా ఆటోమేషన్ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.
పంట వైవిధ్యంతో భూసారం
సిటీబ్యూరో: ఏక కాలంలో పలు రకాల పంటలను ఒకేచోట సాగు చేస్తే.. భూసారం పెరుగుతుందని, దీంతో అధిక దిగుబడి, గ్రీన్హౌస్ వాయువులు, ఉద్గారాలు తగ్గుతాయని ఇక్రిశాట్‌తో పాటు పలు అగ్రీ రీసెర్చ్ ల్యాబ్‌లు చేసిన అధ్యయనంలో తేలింది. ఎనిమిదేండ్ల పాటు సుదీర్ఘకాలం చేసిన అధ్యయనంతో గ్రీన్హౌస్ వాయువుల తగ్గింపు, భూసారాన్ని పెంచడమే లక్ష్యంగా పరిశోధనలు చేయగా, ఒకేసారి రెండు, మూడు రకాల పంటలను సాగు చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు తేల్చారు.
నకిలీ ఎస్సై, హోంగార్డు అరెస్టు
వెంగళరావునగర్: హోంగార్డుతో పాటు నకిలీ ఎస్సైని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ నం.1 ఎదురుగా ఉన్న పాన్‌షాప్ యజమానిని తాము టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ బెదిరింపులకు గురి చేశారు. ‘మీ షాపులో గుట్కాలు అమ్ముతున్నారనే సమాచారం ఉందంటూ… కేసు పెట్టకుండా ఉండేందుకు రూ.5 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుమానం వచ్చి..వారిద్దర్నీ పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఒకరు సైబరాబాద్ ఎస్వోటీలో విధులు నిర్వహించే హోంగార్డు బాదుల్లాగా గుర్తించారు. అతడితో కలిసి వచ్చిన టాస్క్‌ఫోర్స్ నకిలీ ఎస్సై నరసారెడ్డిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.