సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్వాల్‌గూడలోని ఎకో పార్కు నిర్మాణం గత ఏడు నెలలుగా నిలిచిపోయాయి. ఇదే విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువస్తూ ఎక్స్‌లో ప్రభుత్వ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ హెచ్ఎండీఏ చేపట్టిన ప్రాజెక్టులను ప్రత్యక్షంగా సందర్శించారు. పురోగతిలో ఉన్న, ఆగిపోయిన నిర్మాణ ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న నియోపోలిస్ లే అవుట్ పురోగతిని సమీక్షించారు. లే అవుట్‌లోని రోడ్ నం. 4లో రోడ్డును సరిచేయాలన్నారు. కోకాపేటలోని హెచ్ఎండీఏ ఓఆర్ఆర్పై నిర్మిస్తున్న ట్రంపెట్ ఇంటర్ చేంజ్‌ను పనుల పరిశీలించి పనుల్లో జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా రైట్ ఆఫ్ వేకు సమీపంలో గ్రీనరీ పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని, ఖాళీ స్థలాలు ఉన్న చోట గ్రీనరీ పెంచేందుకు సన్నాహాలు చేయాలన్నారు. అదే విధంగా హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల అప్ అండ్ డౌన్ స్ట్రీమ్ నాలాలను పరిశీలించి సీసీ కెమెరా, అవుట్ పోస్ట్ సిబ్బంది, చెరువుల సంరక్షణకు తీసుకున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా చెరువులు, కుంటల్లోకి మురుగు నీరు చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇక ఐటీ కారిడార్, ఓఆర్ఆర్ సమీపంలో ఉన్న హెచ్ఎండీఏ పార్కులు, భూములను, రాయదుర్గం, కోకాపేట, కొత్వాల్‌గూడ ఎకో పార్కులో పరిశీలించారు. ఓఆర్ఆర్ వెంబడి పూల మొక్కలను పెంచాలని, దీంతో గ్రీనరీతోపాటు మరింత ఆకర్షణీయంగా ఉంటుందని అధికారులకు సూచించారు. కమిషనర్ వెంట ఎంఆర్డీసీఎల్ జాయింట్ ఎండీ గౌతమి, అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.