సిటీబ్యూరో, సెప్టెంబరు 2 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ట్రాఫిక్‌కు చెక్ పెట్టేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్ సిటీ, ఎస్ఆర్డీపీ పనుల్లో ప్రాజెక్టు విభాగం అధికారులు జాప్యం చేస్తుండటం పట్ల కమిషనర్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబీఆర్ పార్కు ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం లేదంటూ చీఫ్ ఇంజనీర్ భాస్కర్‌రెడ్డిని కమిషనర్ ప్రశ్నించారు. పనులను త్వరగా మొదలు పెట్టి.. ఆయా ప్రాజెక్టులు ప్రజలకు అందుబాటులోకి వచ్చే వరకు ఇంజనీరింగ్ విభాగంతో పాటు జోనల్ కమిషనర్లు కూడా నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్ని జోన్లలో చేపడుతున్న హెచ్ సిటీ, ఎస్ఆర్డీపీ పనుల పురోగతి, భూ సేకరణపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒక్కో ప్రాజెక్ట్ పురోగతిని కమిషనర్‌కు వివరించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ప్రతిబంధకాలు, సవాళ్లు, పెండింగ్ పనులు, అందుకు గల కారణాలను తెలిపారు. పురోగతిలో ఉన్న పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా ప్రాజెక్టు వారీగా టైమ్ లైన్ ఇవ్వాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.
సమన్వయం అవసరం
యుటిలిటీ షిఫ్టింగ్, పెండింగ్ భూ సేకరణ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. ప్రాజెక్టుల పూర్తికి నిధుల కొరత లేదన్నారు. ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉంటే తనకు తెలియజేస్తే వెంటనే క్లియర్ చేస్తానని తెలిపారు. మెట్రో, రైల్వే అధికారులతో సమన్వయం అవసరం ఉంటే జోనల్ కమిషనర్లకు సూచించాలన్నారు. పనులు జరిగే ప్రదేశాలలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ పోలీసులతో ప్లాన్ చేసుకోవాలని చెప్పారు.
ప్రైవేట్ కన్సల్టెంట్లపై ఆధారపడొద్దు..
హెచ్ సిటీ, ఎస్ఆర్డీపీ పనులకు సంబంధించిన డిజైన్ల రూపకల్పనకు ప్రైవేట్ కన్సల్టెంట్లపై ఆధారపడడం తగ్గించేందుకు, డిజైన్లను వేగంగా ఖరారు చేసేందుకు సీనియర్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల నేతృత్వంలో ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో విధ్యనభ్యసించిన జీహెచ్ఎంసీ ఇంజనీర్లు 10 మందితో ఇన్‌హౌజ్ డిజైన్ వింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, బోర్కడే హేమంత్ సహదేవ్ రావు, హేమంత్ పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, రవి కిరణ్, ప్రాజెక్టు సీఈ భాస్కర్‌రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్, ప్రత్యేక ఉప కలెక్టర్ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.