సికింద్రాబాద్, ఫిబ్రవరి 11: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయ ఆవరణలో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ వేదిక ఏర్పాటు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. బోర్డు పాలకమండలి అధ్యక్షుడు బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఈవో అజిత్‌రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. బ్రిగేడియర్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికే బోర్డు కార్యాలయంలో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశామన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నామని, తొలిసారిగా నిర్వహించిన ఈ సమావేశం ద్వారా వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకుని అందుకనుగుణంగా రానున్న రోజుల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం సీఈవో అజిత్‌రెడ్డి మాట్లాడుతూ 21 రోజుల్లోపు పత్రాలను పొందేవారినుంచి ఎలాంటి రుసుం తీసుకోమన్నారు. 21వ రోజు నుంచి ఏడాదిలోపు పత్రాలను పొందేందుకు వచ్చేవారి నుంచి రూ.35లు వసూలు చేస్తున్నామని తెలిపారు. జనన, మరణాలు ఎక్కువ శాతం ఆసుపత్రుల్లోనే జరుగుతున్నందున ఈసారి జనన, మరణ ధృవీకరణపత్రాల జారీ అంశంపై ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తున్నట్లే ఒక్కో అంశంపై ఒక్కోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు.