సిటీబ్యూరో, జులై 13 (నమస్తే తెలంగాణ): స్నేహితులు.. బంధువులు ఇలా తెలిసిన వాళ్లే మహిళలను వేధిస్తుండడంతో బాధితులు షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. సోషల్‌మీడియా ఫోన్లలో వేధించే వారు మొదట గుర్తుతెలియని వ్యక్తులుగా ఉంటూ తరువాత విచారణలో దగ్గరి వాళ్లనే విషయం వెల్లడవుతుంది. కొందరు తమ వారిపై కక్ష సాధింపు కోసం వేధింపులు పడుతుండగా మరికొందరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలున్నాయి. రాచకొండ షీ టీమ్స్‌కు ఇలాంటి ఫిర్యాదులు వస్తుండడంతో ఆయా ఘటనలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నిందితులను పట్టుకుంపటన్నారు. రద్దీ ప్రాంతాలలో మహిళలు, యువతులను వేధించే వారి ఆట కట్టించడం కోసం డెకాయి ఆపరేషన్లు చేస్తున్నారు. మఫ్టీలో షీ టీమ్స్ తిరుగుతూ పోకిరీల చేష్టలను వీడియోలు తీస్తు రెడ్ హ్యాండెడ్‌గా నిందితులను పట్టుకుంటున్నారు.
కొన్ని కేసులు ..
బాధితురాలి అన్నకు అప్పులుండటంతో తల్లిదండ్రుల ప్రాపర్టీని తాకట్లు పెట్టి అప్పులు తెచ్చుకున్నాడు. అవి సరిపోకపోవడంతో తన తల్లి ఉంటున్న ఇంటిని అమ్మి డబ్బులు ఇవ్వాలని వేధించడంతో ఆమె వృద్దశ్రమానికి వెళ్లిపోయింది. అయితే ఇల్లు అమ్మి డబ్బులు తనకు ఇవ్వాల్సి వస్తుందని, తన సోదరి ఇంటికి వెళ్లి ఉంటుందని బాధితుడు భావించాడు. దీనికి తన సోదరే కారణమని ఉహించుకున్నాడు. ఇక తన సోదరిపై అసభ్యరంగా ప్రచారం చేయడం ప్రారంభించాడు. ఆమె భర్తకు ఆమె క్యారెక్టర్ మంచిది కాదని, పెళ్లికి ముందు వేరేవాళ్లతో సంబంధాలు పెట్టుకుందంటూ అసభ్యకరంగా తప్పుడు ప్రచారం చేశాడు. తనకు ఇల్లు ఇవ్వకపోతే ఆమె భర్తను సైతం చంపేందుకు సిద్ధమంటూ ఇష్టానుసారంగా ప్రవర్తించడంతో బాధితులు షీ టీమ్స్‌ను ఆశ్రయించడంతో క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
పదో తరగతి బ్యాచ్‌మెట్స్ అందరు గెటు టుగెదర్ పార్టీ చేసుకున్నారు. పాఠశాల నాటి గుర్తులను నెమరేసుకున్నారు. ఇందులో పాత స్నేహితులు ఫోన్నెంబర్లను మార్చుకున్నారు. అలాంటి సమయంలో ఓ వ్యక్తి తన 10వ తరగతి స్నేహితురాలి ఫోన్ నెంబర్ తీసుకొని వేధించడం మొదలుపెట్టాడు. అతడి వేధింపులు భరించలేక ఆమె రాచకొండ షీ టీమ్స్‌ను ఆశ్రయించడంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
73 ఏండ్ల ఇంటి యజమాని ఆ ఇంట్లో కిరాయికి ఉంటున్న వారి మైనర్ కూతురిని వేధిస్తున్నాడు. అందరి ముందు రాముడిగా నటిస్తూ ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలికను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. అతడు మంచివాడంటూ తల్లిదండ్రులు భావిస్తుండగా, తనపై జరుగుతున్న వేధింపులను కన్న తల్లిదండ్రులు నమ్మకపోవడంపై ఆవేదనకు గురయ్యింది. దీంతో ఎలాగైన వృద్దుడి ఆటకట్టించాలని, అతడి చేష్టలను వీడియో తీసి, తన తల్లిదండ్రులకు చూపించింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే షీ టీమ్స్‌ను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
యువతి క్రికెట్ శిక్షణ పొందుతుంది అదే శిక్షణ సంస్థలో ఉన్న మరో యువకుడు ఆమెతో అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు. ఇదే అదనుగా ఆమెతో స్నేహం చేసినట్లు నటిస్తూ ప్రేమిస్తున్నానంటూ వెంటపడడం మొదలు పెట్టడంతో ఆమె అతడిని ప్రతిపానను తిరస్కరించి దూరంగా ఉంటుంది. నీవు ప్రేమించకపోయిన ఫర్వాలేదు.. ఓయో రూమ్‌కి రా.. ! లేకుంటే.. క్రికెట్ ఆడుతున్న సమయంలో దిగిన ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్‌మీడియాలో పెడుతానంటూ బెదిరింపులకు దిగాడు.. బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.