హిమాయత్‌నగర్,ఏప్రిల్1: ఓయూ అఫిలియేషన్ లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఆదిత్య డిగ్రీ కాలేజీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం ఓయూ రిజిస్ట్రార్ జి.నరేష్‌రెడ్డికి ఏఐవైఎఫ్ ప్రతినిధి బృందం వినతి పత్రాన్ని అందజేసింది.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.సత్యప్రసాద్ మాట్లాడుతూ..నగరంలోని నారాయణగూడ, దిల్సుఖ్ నగర్, అల్వాల్, హబ్సిగూడ, ఈసీఐఎల్, కూకట్పల్లి, మణికొండ, సైదాబాద్, మియాపూర్, సనత్‌నగర్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఆదిత్య కాలేజీలు నడుస్తున్నాయని తెలిపారు.
ఈ కాలేజీలకు ఓయూ అఫిలియేషన్‌పై స్పష్టత లేకుండానే డిగ్రీ అడ్మిషన్లను తీసుకుంటున్నారని ఆరోపించారు. మెరిట్ బేస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ పేరుతో విద్యార్థులను మోసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నామన్నారు. అనధికారిక ప్రవేశ పరీక్షలు, తప్పుడు ప్రచారాలతో విద్యార్థులను తప్పుదారి పట్టించేందుకు జరిగే ప్రయత్నాలకు అడ్డుకట్టవేయాలని కోరారు. విద్యను వ్యాపారంగా మార్చివేసి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందినకాడికి డబ్బులను దండుకుంటున్నారని ఆరోపించారు. అక్రమ అడ్మిషన్లను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.