సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రక్షించాల్సిన చేతులే భక్షకులుగా మారితే… న్యాయం చేయాల్సిన పోలీసులే సెటిల్మెంట్ బ్రోకర్ల అవతారమెత్తితే బాధితులు ఎక్కడికి వెళ్లాలి..? చట్టాన్ని కాపాడాల్సిన కొందరు ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్లను సివిల్ వివాదాల పరిష్కార కేంద్రాలుగా.. దందా అడ్డాగా మారుస్తున్నారనే దానికి చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనే ఉదాహణగా నిలుస్తోంది. పోలీస్ స్టేషన్‌కు స్వైపింగ్ మెషీన్ తెప్పించి… బాధితుల క్రిడిట్ కార్డుల నుంచి రూ.8.14 లక్షలు ఇతరుల ఖాతాల్లోకి బదిలీ చేయించి సెటిల్మెంట్ చేసిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఏసీపీ కార్యాలయంలో దాదాపు 2గంటల పాటు తమను నిర్బంధించి పోలీసులే సెటిల్మెంట్కు పాల్పడిన ఘటనపై మాజీ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి, ఎన్ఆర్ఐలు గురువారం ఎల్బీనగర్ డీసీపీకి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఘటనకు సంబంధించిన విషయాలు బాధితుల కథనం ప్రకారం.. గతేడాది ఉప్పల్ చౌరస్తాలో క్వెస్ట్ బిజినెస్ టెక్ పేరుతో పల్లం నరేందర్, నాగేంద్ర, హరీష్ రాజ్ వివిధ రకాల వ్యాపారాలు చేసేందుకు కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రధానంగా రుణాలు ఇప్పించే వ్యాపారం చేయాలనుకున్నారు. అయితే హరీష్‌రాజ్ తనకు అఫ్రికా దేశానికి చెందిన వీసా, వర్క్ పర్మిట్లు ఇప్పించడంపై అవగాహన ఉందని ఆ వ్యాపారం కూడా చేద్దామని ఒత్తిడి తెచ్చాడు. అయితే తనకు చైతన్యపురిలో వీసా కన్సల్టెన్సీ నిర్వహించే సూజత పరిచయం ఉందని, ఆమె నుంచి మనకు వర్క్ పర్మిట్ల కోసం ఆర్డర్ వస్తాయంటూ సూచించి, ఆమెను తన భాగస్వాములకు పరిచయం చేశాడు.
ఈ ఒప్పందం మేరకు తనకు వర్క్ పర్మిట్లు ఇప్పించాలని సూజత రూ.6.3 లక్షలు క్వెస్ట్ కంపెనీ ఖాతాకు బదిలీ చేసింది. ఈ మొత్తాన్ని ఆఫ్రికాలో వర్క్ పర్మిట్లు ఇప్పిస్తామని చెప్పిన వారికి పంపించారు. 3 నెలలవుతున్న వర్క్ పర్మిట్ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో తాము ఈ వ్యాపారం చేయలేమని, మీ డబ్బు మీకు వాపస్ ఇచ్చేస్తామంటూ సూజతకు సూచించారు. దీనికి హరీష్ కలుగజేసుకొని, తాను వర్క్ పర్మిట్లు ఇప్పిస్తానని, ఈ విషయం నాకు వదిలేయాలని సూజత, మేం ఈ వ్యాపారం చేసుకుంటామంటూ మాట ఇచ్చారు.
హరీష్ తన వ్యక్తిగతంగా వీసా పర్మిట్ల వ్యాపారం సుజాతతో నిర్వహిస్తూ రూ.39 లక్షల వరకు ఆర్ధిక లావాదేవీలు జరిపారు. సుజాత తనకు వీసా పర్మిట్లు రాకపోవడంతో మే 2వ తేదీన ఉప్పల్‌లోని క్వెస్ట్ కార్యాలయానికి 20 మందితో వచ్చి తనను మోసం చేశారంటూ గొడవ చేసింది. అయితే నాగేంద్ర, నరేందర్ ఈ విషయం తమకు తెలియదని, హరీష్‌తో మాట్లాడంటూ సూచించారు. తమ వ్యాపారం నుంచి ఆయన వెళ్లిపోయాడని, తన వ్యక్తిగతంగా మీతో వ్యాపారం చేస్తున్నాడంటూ నచ్చ జెప్పారు. ఇంతలో హరీష్‌కు ఫోన్ చేసి మీ కోసం సుజాత వాళ్లు వచ్చారంటూ చెప్పడంతో అందరిని ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు రావాలని, అక్కడే అన్ని విషయాలు సెటిల్ చేసుకుంటానని వారికి సూచించాడు. తాము ఎందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తామంటూ అక్కడి నుంచి అందరు వెళ్లిపోయారు.
జూన్ 5వ తేదీ ఉదయం ఇద్దరు కానిస్టేబుల్స్ నాగేంద్ర, నరేందర్ ఇండ్లకు వెళ్లారు. మీపై చైతన్యపురిలో కేసు నమోదయ్యిందని రావాలంటూ సూచించారు. ఇద్దరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో అక్కడ ఎస్సై వెంకటయ్యను కలిశారు. ఎస్సై మీపై సుజాత ఫిర్యాదు చేసింది. ఆమె వద్ద నుంచి రూ.39 లక్షలు మీరు తీసుకున్నారని ఫిర్యాదు చేసింది. ఆ డబ్బులు కడుతారా? లేక బొక్కలో వేయమంటరా అంటూ బెదిరింపులకు దిగాడు. తమకు ఆ డబ్బుతో సంబంధం లేదని, తమ కంపెనీలో రూ.6.3 లక్షలు మాత్రమే ఆమె డిపాజిట్ చేసిందని, ఆ డబ్బులు కూడా హరీష్ సెటిల్ చేసుకున్నాడని, ఆమెకు, మాకు, వర్క్ పర్మిట్లకు సంబంధం లేదని.. అదంతా హరీష్‌తో సంబంధమని చెప్పినా ఎస్ఐ వినకుండా పోలీస్ స్టేషన్లోనే గంటల తరబడి లాకప్ పక్కన కూర్చోబెట్టాడు.
అనంతరం ఎల్బీనగర్ ఏసీపీ కిష్టయ్య నాగేంద్ర, నరేందర్‌ను తీసుకొని తన వద్దకు రావాలని ఎస్ఐకి ఆదేశించడంతో అక్కడి వెళ్లారు. అప్పటికే నాగేంద్ర, నరేందర్‌పై ఫిర్యాదు చేసిన సుజాత తమ అనుచరులతో ఏసీపీ కార్యాలయంలో ఉంది. ఏసీపీ కార్యాలయంలోకి వెళ్లగానే నాగేంద్ర, నరేందర్‌పై ఏసీపీ బూతు పురాణం అందుకున్నాడు. 2 గంటల పాటు ఏసీపీ కార్యాలయంలో వాళ్లను నిలబెట్టి సెటిల్ చేసుకుంటారా? లేక కేసు పెట్టి బొక్కలో వేయమంటరా? అంటూ బెదిరింపులకు దిగాడు. రూ.39 లక్షల్లో వెంటనే రూ.15 లక్షలు ఇచ్చేసి సెటిల్ చేసుకోండంటూ ఏసీపీ హుకూం జారీ చేశారు. దీంతో వెంకటయ్య వాళ్లిదరిని తీసుకొని తిరిగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. బాధితుడు ఎల్బీనగర్ డీసీపీని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో డీసీపీ విచారణ ప్రారంభించారు. ఈ విషయంపై డీసీపీని నమస్తే తెలంగాణ వివరణ కోరగా ఫిర్యాదు వచ్చిందని, విచారణ చేస్తున్నామని తెలిపారు.
క్విస్ట్ బిజినెస్ టెక్ సంస్థ నిర్వాహకులు హరీష్‌రాజు, నాగేందర్, నరేందర్‌పై చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఎన్.సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని చైతన్యపురి ఎస్‌హెచ్ ఓ ప్రకటనలో తెలిపారు. 31 మంది అభ్యర్థుల నుంచి వీసాల కోసం రూ.39 లక్షలు తీసుకొని మోసం చేశారనే ఫిర్యాదు నేపథ్యంలో ఇరు పార్టీలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. పరిష్కారం కోసం ఏసీపీ ఎల్బీనగర్ ఆఫీస్‌కు వెళ్లారు. అక్కడకు ఎస్సై వెంకటయ్య కూడా వెళ్లారు. నిందితులపై కేసు నమోదు కావడంతో నోటీసులు పంపించామని ఎస్‌హెచ్ స్పష్టం చేశారు.