కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 8: అధికార కాంగ్రెస్ నేతలు (Congress) తమ హోదాను చాటుకునేందుకు పార్టీ అధినేతల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీల బోర్డులను విచ్చలవిడిగా ఏర్పాటు చేయడంతో అవి కాస్త ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందికరంగా మారుతున్నాయని మండిపడుతున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో దూలపల్లి ప్రధాన రహదారిపై అధికార పార్టీకి చెందిన నేతలు తమ అధినేతల మెప్పును పొందేందుకు గత కొన్ని రోజులు విచ్చలవిడిగా.. ఇష్ట రాజ్యాంగ ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. దూలపల్లి టీ జంక్షన్ నుంచి విలేజ్‌కి వెళ్లే ప్రధాన రహదారిపై ఇటీవల హెచ్ఎండీఏ నేతృత్వంలో రోడ్డును అభివృద్ధి చేసి దానికి ప్రకటన బోర్డులను ఏర్పాటు చేశారు.
అయితే అవి మాత్రమే కాకుండా.. జాతీయ రహదారి 44 ప్రధాన రహదారి తోపాటు దూలపల్లి నుంచి నర్సాపూర్ రాష్ట్ర రహదారికి ఇరువైపులా దాదాపుగా 5 నుంచి 7 కిలోమీటర్ల వరకు ప్రకటన బోర్డులను, రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసే నిబంధనలు లేకున్నప్పటికీ ఓ తాజా మాజీ ఎమ్మెల్యే అండతో ఆ నేతలు ఏర్పాటు చేస్తున్న ప్లెక్సీల కటౌట్లతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు తప్పడంలేదని స్థానికులు మండిపడుతున్నారు.
దూలపల్లి టీ జంక్షన్ వద్ద ఏర్పాటుచేసిన ఓ భారీ కటౌట్ తో భారీ వాహనాలు దూలపల్లి గ్రామానికి వెళ్లేందుకు ప్రధాన మూలమలుపు కావడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. దీనికి తోడు ఎన్ హెచ్ 44 జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్న సమయంలో ఇలాంటి బోర్డులను ఏర్పాటు చేయడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దీనిపై కొంపల్లి మున్సిపాలిటీ అధికారులు, అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు తగు చర్యలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు తమ ప్రచార ఆర్భాటాలను ప్రధాన రహదారులు, దారులకు ఇరువైపులా అనధికారికంగా ఏర్పాటు చేయడం కారణంగా తీవ్ర విమర్శలకు తావునిస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు అనాధికారికంగా ఏర్పాటు చేయడం కారణంగా ఖజానాకు గండి కొడుతున్నారని పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి అనధికార ఫ్లెక్సీలను, కటౌట్లు నిర్వహణపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.