సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ల విషయంలో భారీ ప్రక్షాళనకు కమిషనర్ ఆర్వీ కర్ణన్ శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉన్న అడిషనల్ కమిషనర్, ఇతర అధికారుల శాఖల్లో భారీగా మార్పులు చేశారు. పది మంది ఉన్న అడిషనల్ కమిషనర్ల స్థానాన్ని గతంలో మాదిరిగానే ఆరు స్థానాలకు కుదించారు. ఇద్దరు అడిషనల్ కమిషనర్లకు డిమోషన్ ఇచ్చారు. అడిషనల్ కమిషనర్లుగా కొనసాగిన డాక్టర్ ఎన్ యాదగిరి రావు, జి. నళిని పద్మావతిలను పేరెంట్ డిపార్ట్మెంట్కు రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం అడ్వర్టైజ్ మెంట్, ఎలక్ట్రికల్ విభాగాల అదనపు కమిషనర్‌గా వ్యవహరిస్తున్న వేణుగోపాల్ రెడ్డి నుంచి అడ్వర్ టైజ్ మెంట్‌ను తొలగిస్తూ ఆ విభాగం అదనపు కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్ అయిన అనురాగ్ జయంతికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే అనురాగ్ కు ఐటీ, రెవెన్యూ విభాగాలుండగా, అదనంగా ప్రకటనల బాధ్యతలు సమకూరాయి. వేణుగోపాల్ రెడ్డికి చార్మినార్, సికింద్రాబాద్, ఎల్బీ నగర్ జోన్ల శానిటేషన్ విభాగానికి జాయింట్ కమిషనర్‌గా నియమించారు. స్పోర్ట్స్ అదనపు కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న యాదగిరిరావును ఆ బాధ్యతల నుంచి తప్పించి, యూబీడీ అదనపు కమిషనర్ సుభద్రాదేవికి స్పోర్ట్స్ బాధ్యతలను అదనంగా అప్పగించారు.
యాదగిరిరావుకు ఎలాంటి బాధ్యతలను కేటాయించలేదు. హెల్త్ విభాగం అదనపు కమిషనర్ గా వ్యవహరిస్తున్న పంకజను తప్పించి, ఆమెకు యూసీడీ అదనపు కమిషనర్ బాధ్యతలను అప్పగించారు. హెల్త్‌తో పాటు శానిటేషన్ బాధ్యతలను రఘుప్రసాద్‌కు అప్పగించి, సీనియార్టీకి ప్రాధాన్యత ఇస్తామన్న కమిషనర్ మాట నిలబెట్టుకున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ అదనపు కమిషనర్‌గా ఉన్న సరోజను తప్పించి, ఆమెను డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీస్ బాధ్యతలను అప్పగించారు. కూకట్ పల్లి జోన్ జాయింట్ కమిషనర్ శంకర్‌ను హెల్త్ విభాగం జాయింట్ కమిషనర్‌గా నియమించారు.
ప్రస్తుతం ఎస్టేట్ విభాగానికి అదనపు కమిషనర్‌గా పని చేస్తున్న అశోక్ సామ్రాట్‌ను శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఖైరతాబాద్ జోన్ల శానిటేషన్ విభాగానికి జాయింట్ కమిషనర్‌గా బదిలీ చేశారు. హెల్త్ విభాగం జాయింట్ కమిషనర్ జయంత్ రావు జీహెచ్ఎంసీ నుంచి తప్పించి, మున్సిపల్ సెక్రటరీ పేషీకి బదిలీ చేసి, జాయింట్ కమిషనర్ (కో ఆర్డినేషన్)కు బదిలీ చేశారు. ముఖ్యమైన స్ట్రీట్ లైట్ మెయింటనెన్స్ బాధ్యతలను గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంజనీరింగ్ విభాగానికి కట్టబెడుతూ మెయింటనెన్స్ చీఫ్ ఇంజినీర్‌కు కేటాయించారు. హౌసింగ్ విభాగాన్ని కూడా అదనపు కమిషనర్ నుంచి కట్ చేసి, చీఫ్ ఇంజినీర్ హోసింగ్కు కేటాయించారు.
ప్రస్తుతం ఎలక్షన్ విభాగానికి అదనపు కమిషనర్‌గా వ్యవహరిస్తున్న అలివేలు మంగతాయారుకు అదనంగా ఎస్టేట్ విభాగాన్ని కేటాయించారు. కులీ కుతుబ్ షాహీ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ సెక్రటరీ రామదేవికి ఎలక్షన్ వింగ్ జాయింట్ కమిషనర్ గా ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. హెరిటేజ్ బాధ్యతలు సిటీ చీఫ్ ప్లానర్ శ్రీనివాస్‌కు అప్పగించారు. కాగా జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ దాదాపు అన్ని విభాగాల్లో బదిలీలు, బాధ్యతల బదలాయింపులు చేస్తూ ఉత్తర్వు లు జారీ చేసినా, ఒక విభాగంలో మార్పు చేయలేదు. ఫైనాన్స్ విభాగానికి అదనపు కమిషనర్‌గా వ్యవహరిస్తున్న గీతారాధికను అదే పోస్టులో కొనసాగించడం గమనార్హం.