సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్ల కుదింపుపై కమిషనర్ ఆర్వీ కర్ణన్ కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 10 మందిలో సంఖ్యను మరింత తగ్గించి.. పాత విధానంలో కొనసాగిన ఆరుగురితో పాలన కొనసాగేలా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో మూడు నుంచి నాలుగు శాఖలకు అడిషనల్ కమిషనర్లు ఉండగా..ఒక్కో శాఖకు ఒక్కో అదనపు కమిషనర్‌గా కొనసాగుతూ వచ్చారు.
ఒక్కో విభాగానికి ఒక్కో అదనపు కమిషనర్ చొప్పున ఇంతమంది అదనపు కమిషనర్లు అవసరమా? అంటూ పలు సందర్భాల్లో ప్రస్తుత కమిషనర్ కర్ణన్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జరిపిన ఐఏఎస్ బదిలీల్లో భాగంగా ఇద్దరు ఐఏఎస్‌లు ఇతర శాఖలకు బదిలీపై వెళ్లారు. జీహెచ్ఎంసీలో ప్రకటనల విభాగం, యూసీడీ విభాగాలకు అదనపు కమిషనర్‌గా విధులు నిర్వహించిన 2017 బ్యాచ్‌కు చెందిన స్నేహ శబరీష్ హనుమకొండ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. జీహెచ్ఎంసీలో నెలన్నర రోజుల క్రితం హౌసింగ్, లేక్స్, ఎలక్ట్రికల్ విభాగాలకు అదనపు కమిషనర్‌గా పనిచేసిన 2011 బ్యాచ్‌కు చెందిన కిల్లు శివ కుమార్ నాయుడును ఆర్అండ్ఆర్ ల్యాండ్ అక్విజేషన్ కమిషనర్‌గా నియమించారు.
పదికి పడిపోయిన అదనపు కమిషనర్ల సంఖ్య..
వీరి స్థానంలో ప్రత్యామ్నాయంగా ఎవ్వరినీ నియమించలేదు. అంతకుముందు చంద్రకాంత్‌రెడ్డి, సరోజ.. జీహెచ్ఎంసీ నుంచి రిలీవ్ అయ్యారు. దీంతో జీహెచ్ఎంసీలో కొన్ని రోజుల క్రితం ఐఏఎస్, న్యాన్ క్యాడర్ అధికారులతో కలిపి మొత్తం 14 మంది అదనపు కమిషనర్లు ఉండగా, ఇప్పుడు ఇద్దరు అదనపు కమిషనర్లు, అంతకుముందు మరో ఇద్దరు అధికారులు బదిలీ కావడంతో ఈ సంఖ్య 10కి పడిపోయింది. ఇప్పుడు ఈ సంఖ్యను గతంలో మాదిరిగా ఆరుగురితో పరిమితం చేస్తారా? ఎనిమిది మందితో సరిపెట్టి ఆర్వీకర్ణన్ తన మార్కు పాలన వేస్తారా? అన్నది ఉత్కంఠంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఒకటి, రెండు రోజుల్లో అదనపు కమిషనర్ల అంతర్గత బదిలీలు జరిపేందుకు కమిషనర్ సిద్ధం అవుతున్నట్లు సమాచారం.