సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ): ఎన్నికల విధులను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు. శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గం పీఓ, ఏపీఓ, పోలింగ్ సిబ్బందికి దోమలగూడ ఏవీ కళాశాలలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ట్రైనింగ్ క్లాస్‌లను ఆషామాషీగా తీసుకోకుండా సీరియస్‌గా తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ డే సందర్భంగా పీఓలు తీసుకోవాల్సిన చర్యలు, బాధ్యతపై క్లుప్తంగా వివరించారు. ఎన్నికల కమిషన్ ప్రతి అంశంపై విధులకు సంబంధించిన నిబంధనలు జారీ చేసిందనీ, ఈ నేపథ్యంలో పీఓ బుక్‌లో పొందుపర్చిన నియమావళి ప్రకారంగా విధులు నిర్వహించాలన్నారు. మాక్ పోలింగ్ సందర్భంగా పాటించాల్సిన అంశాల గూర్చి వివరించారు. మాక్ పోలింగ్ ఉదయం 5.30 గంటలలోగా పూర్తి చేయాలని, కనీసం ఇద్దరు ఏజెంట్లు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. కొందరు పీఓలు శిక్షణకు రాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో తప్పులు చేస్తారని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని, తప్పులు జరిగితే క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటారన్నారు. ఎన్నికల సమయంలో సస్పెండ్ చేస్తే ప్రభుత్వం కూడా పట్టించుకోదని తెలిపారు. ఈ సమావేశంలో ముషీరాబాద్ ఆర్ఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు.