GHMC | సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో రోడ్ కటింగ్ అనుమతులపై కమిషనర్ ఇలంబర్తి నూతన నియమ నిబంధనలను అమల్లోకి తీసుకువస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అడ్డగోలుగా రోడ్ కటింగ్ పర్మిషన్లు ఇస్తుండడం, తిరిగి పునరుద్ధరణలో జాప్యం కారణంగా వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతుండడం, అంతేకాకుండా ముఖ్యంగా అసంపూర్తిగా రోడ్ కటింగ్ ప్రతిపాదనలు సమర్పిస్తుండడం పట్ల కమిషనర్‌కు ఫిర్యాదులు వెలువెత్తాయి.
అన్నింటి కంటే జోనల్ కమిషనర్ల అనుమతితో రోడ్ కటింగ్ పర్మిషన్లు ఇక ఉండకుండా నేరుగా సంబంధిత ఇంజినీర్లే బాధ్యులుగా వ్యవహరించనున్నారు. రోడ్ కటింగ్ పర్మిషన్ నుంచి రహదారి పునరుద్ధ్దరణ వరకు ఇంజినీర్లు కీలకం కానున్నారు.
నూతన నియమ నిబంధనలు ఇవే
అంచనాలు, మంజూరీలు తప్పనిసరి
రోడ్ కటింగ్ పనులు పూర్తయిన వెంటనే రోడ్డును పునరుద్ధరించేందుకు ఇంజినీర్లు అంచనాలు తయారు చేసి, దానికి సంబంధించిన మంజూరీని కూడా జతపర్చాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సంబంధిత రోడ్డుకు సంబంధించి ల్యాండ్ కాస్ట్, కటింగ్‌కు సంబంధించిన గణాంకాలను కూడా సమర్పించాల్సి ఉంటుందన్నారు.
విద్యుత్ స్తంభాల ఏర్పాటు కోసం వస్తున్న రోడ్డు కటింగ్ ప్రతిపాదనలకు గూగుల్ మ్యాప్‌ను కూడా పంపించాలి. కటింగ్‌లకు విధించే చార్జీలకు 16.5 శాతం సెంటేజీ చార్జీలను, అలాగే రోడ్డు పునరుద్ధరణ పనులకు 18 శాతం జీఎస్టీని విధిస్తూ సీఈ (చీఫ్ ఇంజినీర్)కి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందని సర్క్యూలర్‌లో పేర్కొన్నారు.