మల్కాజిగిరి, డిసెంబర్ 31: అయ్యప్ప స్వామి జననం పై భారత నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని మతాలను గౌరవిస్తూ సంస్కృతి సంప్రదాయాల నిలయమైన భారతదేశం ప్రపంచానికే ఆదర్శమన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
పలు చోట్ల నిరసనలు..
అయ్యప్ప స్వామి జననంపై, హిందూ దేవుళ్ల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ చందానగర్, అల్వాల్, గుండ్లపోచంపల్లి, చీర్యాల్ , హయత్‌నగర్,వనస్థలిపురంలో,రామంతాపూర్, హెచ్‌బీకాలనీ నుంచి ఈసీఐఎల్ చౌరస్తాలో ఆందోళనలు, నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాల్లో అయ్యప్ప స్వాములు, భక్తులు, హిందూ ధర్మ పరిరక్షకులు, అయ్యప్ప స్వామి సేవా సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.
కవాడిగూడ : అయ్యప్ప స్వాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌ను కఠినంగా శిక్షించాలని సుఖీభవ అయ్యప్ప సేవా సంఘం డిమాండ్ చేసింది. శనివారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయం చౌరస్తాలో అయ్యప్ప స్వాములు భారీ ర్యాలీతో పాటు రాస్తారోకో, మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సుఖీభవ అయ్యప్ప సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గురుస్వామి సాత్విక్ శర్మ, ప్రధాన కార్యదర్శి మణిగండర్ అయ్యర్, ఉపాధ్యక్షుడు మల్కిరెడ్డి ముకుందరెడ్డి, సభ్యులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
అయ్యప్ప స్వాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌ను కఠినంగా శిక్షించాలని అయ్యప్ప స్వాములు ముషీరాబాద్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు.